తాడిపత్రికి రాకుండా మరోమారు అడ్డుకున్న పోలీసులు
జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల బెదిరింపులకు తలొగ్గిన వైనం
తాడిపత్రిటౌన్: అనంతపురం జిల్లా, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు సోమవారం హౌస్ అరెస్టు చేశారు. శింగనమల నియోజకవర్గ పరిధిలోని యల్లనూరు మండలం, తిమ్మంపల్లిలోని స్వగృహంలో నిర్బంధించారు. 41 సెక్షన్ కింద నోటీసు జారీ చేశారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసానికి రాకుండా మరోమారు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడ్డుపెట్టకుండా పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి..వివిధ కారణాలు చూపుతూ ఆయన్ను నిలువరిస్తున్నారు.
మొన్నటి వరకు కేతిరెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాడిపత్రిలో సొంతిల్లు కూడా ఉంది. అయినా శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి తాడిపత్రికి రానివ్వడం లేదు. సోమవారం తాడిపత్రికి వస్తున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. వస్తే అడ్డుకుంటామని జేసీ అనుచరులు హెచ్చరించడంతో తాడిపత్రిలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి దాదాపు 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ, కేతిరెడ్డి ఇళ్ల మధ్య ఉన్న కళాశాల ఆట స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో పట్టణమంతా నిఘా ఉంచారు. రెండు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద ఉన్న దుకాణాలను మూసివేయించారు. జనం గుంపులుగా ఉండకుండా చెదరగొట్టారు. ఉదయం 11 గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారన్న సమాచారంతో పోలీస్ బలగాలు వెనుదిరిగాయి.
నా ఇంటికి వెళ్లాలన్నా వీసా కావాలా? కేతిరెడ్డి
‘నేను తాడిపత్రిలోని సొంతింటికి వెళ్లాలన్నా వీసా కావాలేమో చెప్పండి..అప్‌లై చేసుకుంటా’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణంగా వేరే దే«శానికి వెళ్లాలంటే వీసా కావాలని, కానీ ఇప్పుడు పోలీసుల తీరు చూస్తుంటే తాడిపత్రికి వెళ్లాలన్నా వీసా తీసుకోవాలేమోనన్న అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగడాలు శ్రుతిమించాయన్నారు. తనను నమ్మి తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు 80 వేల మంది ఓట్లు వేశారని, వారి బాగోగులు చూసేందుకు తాడిపత్రికి వచ్చి తీరుతానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment