సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
కాగా, ఆదివారం తెల్లవారుజామునుంచే ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. మిథున్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే, నేడు మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు.
ఇక, మిథున్ రెడ్డి ఇంట్లోకి కొత్త వారిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఎవరైనా వస్తే వారికి అడ్డుకుంటున్నారు. ప్రజలను కలిసేందుకు కూడా మిథున్ రెడ్డిని అనుమతించడం లేదు. దీంతో, భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ అభిమానులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీరియస్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘గతంలో ఎప్పుడూ లేని విధంగా పేదలు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పేదలు ఆవులు ఎత్తుకుని పోతున్నారు. నియోజకవర్గంలో ప్రజల్ని కలవడానికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
నా నియోజకవర్గంలో ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటున్నారు.. ఇదే విషయం స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తాను. రాష్ట్రంలో 40 శాతం ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారు. వీళ్లందరినీ రాష్ట్రం నుంచి బయటకు పంపించి వేస్తారా?. గతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాము. పుంగనూరు నియోజక వర్గంపై కక్ష సాధిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్ కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు .
పదవులు కావాలి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని తిడితే వస్తాయి అనుకుంటున్నారు. టీడీపీ పుంగనూరు ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని భయపెడుతున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. నన్ను చంపినా పర్వాలేదు, మేము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం’ అని చెప్పారు.
అలాగే, బీజేపీలో చేరుతున్నారు అంటూ చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. కొందరు పనిగట్టుకుని నాపై విష ప్రచారం చేస్తున్నారు. పుంగనూరులో ఫ్యాక్షన్ తరహాలో రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ మారకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలుస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment