సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోంది. తిరుపతికి ఎవరూ రావద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.
ఆదోనిలో పోలీసుల అత్యుత్సాహం
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తిరుపతి వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. నేటి నుండి నెల రోజుల పాటు తిరుమల వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. చట్టానికి విరుద్ధంగా నోటీసులు ఇవ్వడం మంచి పద్దతి కాదంటూ మధుసూదన్ మండిపడ్డారు.
ప్రజాస్వామ‍్యం అపహాస్యం: సతీష్‌కుమార్‌రెడ్డి
వైఎస్సార్ జిల్లా: తిరుమలకు వెళ్లకూడదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుమలకు వెళ్లొద్దంటూ నోటీసులు తీసుకుని కడపలోని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా నివాసానికి పోలీసులు వెళ్లారు. తిరుమలకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడానికి మీరెవరూ అంటూ పోలీసులను నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆకేపాటి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
అన్నమయ్య జిల్లా: రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తిరుమల వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్యే విరూపాక్షికి పోలీసులు నోటీసులు
కర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తిరుమలకు వెళ్లకుండగా ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తీరు విరూపాక్షి మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌తో తిరుమల నిజాన్ని దాచలేవు చంద్రబాబూ అంటూ ధ్వజమెత్తారు. మా నాయకుడు ఏ తప్పు చేయలేదని ధైర్యంగా తిరుమలకు వస్తున్నారని విరూపాక్షి అన్నారు.
అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు?: ఎస్వీ మోహన్‌రెడ్డి
స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు.. తిరుపతి వెంకటేశ్వరస్వామితో చెలగాటమాడుతున్నారని కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుపతి ఉన్న పవిత్రతను దెబ్బ తిశారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై విఘాతం కలిగించేందుకు పవన్, చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ అనేక సార్లు తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు?. లడ్డు కల్తీపై ఇంత వరకు నిజానిజాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడం లేదు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు, పవన్ లడ్డూ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.
ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతల నిర్బంధం
తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు వైఎస్సార్‌సీపీ నేతలను వెళ్లనీయకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నాయకులను నిర్బంధిస్తున్నారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందంటూ వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment