వచ్చే నెల 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. అవినీతి కేసులతో ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (71) సొంత రాజకీయ పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ). దీని ఎన్నికల చిహ్నం- క్రికెట్ బ్యాట్. మరో రెండు వారాల్లో జరగనున్న దేశ సాధారణ ఎన్నికల్లో క్రికెట్ బ్యాట్ ఎన్నికల గుర్తును వాడకుండా పీటీఐపై దేశ ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. తమ ఎన్నికల గుర్తు మీద ఈసీ నిషేధం విధించడంపై ఇమ్రాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పీటీఐ ఓటమికి కోసం మిలిటరీ మద్దతున్న ఆపద్ధర్మ ప్రభుత్వం పన్నిన కుట్రగా ఇమ్రాన్ మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు. ఇమ్రాన్ పార్టీ పీటీఐ నిబంధనల ప్రకారం అంతర్గత ఎన్నికలు నిర్వహించనందునే ఎన్నికల గుర్తు వినియోగంపై ఆంక్షలు విధించామని ఎన్నికల సంఘం అంటోంది.
వాస్తవానికి గత సంవత్సరం జూన్ 8న ఇమ్రాన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. అయితే సజావుగా జరగలేదంటూ ఆ ఎన్నికలను గుర్తించడానికి పాక్ ఎన్నికల సంఘం నిరాకరించింది. ఈసీ చర్య అన్యాయం, అక్రమం, రాజకీయ దురుద్దేశపూరితమని, ఇదంతా ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని నిరోధించేందుకేనని ఇమ్రాన్ మద్దతుదారులు ఆక్రోశిస్తున్నారు. 13 చిన్నాచితకా రాజకీయ పార్టీల విషయంలోనూ ఈసీ ఇలాంటి ఉత్తర్వులే వెలువరించింది.
ఎన్నికల చిహ్నంపై నిషేధాన్ని తొలగించుకునేందుకు పీటీఐ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ వారికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పీటీఐకి ఈ తీర్పు శరాఘాతంలా తగులుతోంది. ఎన్నికల్లో పార్టీ గుర్తులను రాజకీయ పార్టీలు కోల్పోవడం పాకిస్తాన్లో కొత్తేమీ కాకపోయినప్పటికీ, పీటీఐ తమ అభ్యర్థులందరికీ ఇతరత్రా ఓ గుర్తును ఎంచుకునే సమయం, అవకాశం సైతం లేకుండా పోయింది. అందుకు ఉద్దేశించిన నిర్ణీత గడువు ముగిసింది.
చిహ్నాల్ని మార్చే ప్రక్రియ ఇంకా కొనసాగితే ఎన్నికల నిర్వహణలో మరింత జాప్యం జరుగుతుందని ఈసీ చెబుతోంది. ఈ గందరగోళాన్ని తొలగించేలా తమ పార్టీ అభ్యర్థుల పేర్లు-చిహ్నాలను ఓటర్లు అన్వేషించేందుకు వీలుగా ఇమ్రాన్ పార్టీ సామాజిక మాధ్యమాల బృందం ఓ పోర్టల్ నడుపుతోంది. పాకిస్తాన్లో సగం మంది ప్రజలకే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీంతో ఓటర్ల వద్దకు చేరడంలో ఇమ్రాన్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏదేమైనా క్రికెట్ బ్యాట్ గుర్తును కోల్పోవడం తమ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీస్తుందని పీటీఐ నేతలు ఆందోళన చెందుతున్నారు. క్రికెట్ మీద మహా మోజున్న పాక్ లాంటి దేశంలో ఓటర్లను ఇమ్రాన్ పార్టీ వైపు ఆకర్షించడానికి బ్యాట్ గుర్తు సమ్మోహనాస్త్రంలా ఉపయోగపడింది.
‘త్రాసు’ కోసం న్యాయపోరాటం!
క్రికెట్ బ్యాట్ గుర్తుతో ఇమ్రాన్ రాజకీయ పార్టీ పీటీఐకి విడదీయరాని అనుబంధం ఉన్నప్పటికీ నిజానికి దాని తొలి ఎన్నికల గుర్తు ‘దీపం’. పీటీఐ పేరులోని ‘ఇన్సాఫ్’ అంటే ఉర్దూలో న్యాయం అనే అర్థం వస్తుంది. 2013 ఎన్నికలకు ముందు పీటీఐ న్యాయానికి ప్రతీకగా ‘సమ త్రాసు’ గుర్తును వాడుకోవాలని భావించింది. కానీ, ‘సమ త్రాసు’ 1970 సాధారణ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ పార్టీ గుర్తుగా ఉంది. ఈ గుర్తు కోసం ఇరు పార్టీల మధ్య సాగిన న్యాయపోరాటంలో చివరికి జమాతే ఇస్లామీ పార్టీదే పైచేయి అయింది. 1977 సార్వత్రిక ఎన్నికల అనంతరం జనరల్ జియా-ఉల్-హక్ నేతృత్వంలోని సైనిక సర్కారు కొన్ని ఎన్నికల చిహ్నాల్ని ఆమోదిత జాబితా నుంచి తొలగించింది. అలా తొలగించిన వాటిలో త్రాసు గుర్తు ఉంది. తర్వాత 2010 సంవత్సరంలో పాకిస్తాన్ ఎన్నికల సంఘం త్రాసు గుర్తును పునరుద్ధరించింది.
పాక్ ఎన్నికల్లో గుర్తుల ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ‘’పాకిస్తాన్ జనాభాలో 40% మంది నిరక్ష్యరాస్యులు. విద్యావంతులు కాని ఓటర్లు ఓటు వేయడానికి గుర్తులపై ఆధారపడతారు, పేర్లు చదవగలిగిన పౌరుల్లోనూ చాలామంది ఎల్లప్పుడూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. కానీ వారికి పార్టీ గుర్తు మాత్రం తెలుసు” అని ‘జియో’ జర్నలిస్టు మాలిక్ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాల్లోని నినాదాలు, గీతాలు వాటి గుర్తుల చుట్టూ అల్లుకుని వుంటాయి అని ఆమె చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు 150 గుర్తులు కేటాయించగా మరో 174 గుర్తుల్ని స్వతంత్ర అభ్యర్థులకు ఇస్తున్నారు. మూడు సార్లు దేశ ప్రధాన మంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ (74) ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ పులి గుర్తుతో, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) బాణం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.
మిలిటరీ మ్యాన్ నవాజ్ షరీఫ్!
ప్రజాదరణ ఎంత బలంగా ఉన్నప్పటికీ రాజకీయ క్రీజులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి రావడం దుర్లభం గానే కనిపిస్తోంది. ఇంత ఎదురుగాలిలోనూ గత డిసెంబరులో నిర్వహించిన ఓ ఒపీనియన్ పోల్ ప్రకారం... నవాజ్ షరీఫ్ (52%)తో పోలిస్తే ఇమ్రాన్ ఖాన్ (57%)కే అధిక అప్రూవల్ రేటింగ్స్ దక్కడం విశేషం. పీటీఐని అణచివేసేందుకు మిలిటరీ ట్రిక్స్ ప్రయోగిస్తోంది. ఇటీవలి కాలంలో పీటీఐ కార్యకర్తలు పలువురు అరెస్టయ్యారు. కొందరు నేతలు ‘ఇంటరాగేషన్స్’ తట్టుకోలేక పార్టీకి రాజీనామాలు చేశారు.
ప్రధాన సమాచార మాధ్యమాల్లో ఇమ్రాన్ పేరు ఉచ్చరించడాన్ని నిషేధించారు. ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. చివరికి... ప్రతిపాదించేవారు, బలపరిచేవారు దొరక్క (కిడ్నాప్స్/అపహరణలకు గురై)... ఇమ్రాన్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు కూడా పెద్ద సంఖ్యలో (దాదాపు 90%) తిరస్కృతికి గురయ్యాయి. నవాజ్ షరీఫ్ పాక్ మిలిటరీ నుంచి సహకారం పొందుతున్నారు. పాక్ ప్రధానమంత్రి పీఠంపై కూర్చొని పూర్తి పదవీకాలాన్ని అనుభవించిన వారెవరూ లేరు. ఆ అదృష్టం తొలిసారిగా, నాలుగో విడతలో షరీఫ్ ను వరిస్తుందేమో చూడాలి.
మిలిటరీతో షరీఫ్ ఒప్పందం: బిలావల్
తూర్పు పంజాబ్ ప్రావిన్సులో పోటీ చేస్తున్న తమ పార్టీ జాతీయ, అసెంబ్లీ అభ్యర్థులకు తప్పుడు ఎన్నికల గుర్తులు కేటాయించారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో-జర్దారీ అంటున్నారు. నవాజ్ షరీఫ్ ఒత్తిడి మేరకే దేశ ఎన్నికల సంఘం ఇలా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తెర వెనుక ఉంటూ రాజ్యాధికార శక్తుల్ని నియంత్రించే మిలిటరీతో షరీఫ్ ఒప్పందం కుదుర్చుకున్నారని బిలావల్ ఆరోపిస్తున్నారు.
కొన్నేళ్లు స్వయం ప్రకటిత ప్రవాసం గడిపి నిరుడు అక్టోబరులో స్వదేశానికి వచ్చిన నవాజ్ షరీఫ్... బిలావల్ ఆరోపణలను కొట్టిపారేశారు. అవినీతి కేసుల్లో పదవి నుంచి 2017లో ఉద్వాసనకు గురై పదేళ్ళ జైలు శిక్ష పడిన నవాజ్ షరీఫ్... వైద్యచికిత్స కోసమంటూ బెయిల్ మీద లండన్ వెళ్ళి అక్కడే (పరారై ప్రవాసం) తలదాచుకున్నారు. ఆయన అకస్మాత్తుగా నిరుడు అక్టోబరు 21న స్వదేశానికి విచ్చేశారు. ‘అవినీతి మరకల్ని, రాజాకీయాల నుంచి శాశ్వత నిషేధాన్ని’ వదిలించుకుని 4వ సారి ప్రధాని అయ్యే ఆశతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
- జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment