పాక్‌ ఎన్నికలు.. పది ముఖ్య విషయాలు | Ten Things About Pakistan Elections | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 25 2018 5:51 PM | Last Updated on Wed, Jul 25 2018 8:39 PM

Ten Things About Pakistan Elections - Sakshi

ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేక పోయారు.

సాక్షి, న్యూఢిల్లీ : స్వాతం‍త్ర్యం వచ్చిన 71 ఏళ్లలో ముప్పయ్యేళ్ల పాటు సైనిక పాలన చవిచూసిన పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు ఒక్కసారే ఒక పౌర ప్రభుత్వం నుంచి మరో పౌర ప్రభుత్వం పగ్గాలు అందుకుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధాన మంత్రి కూడా పూర్తికాలం పదవిలో కొనసాగక పోవడం గమనార్హం. జాతీయ అసెంబ్లీకి(పార్లమెంటు) , ప్రొవిన్షియల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ 10 విశేషాలను తెలుసుకుందాం..!

1.దేశ వ్యాప్తంగా ఉన్న 10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి  85 వేల పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు.

2. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ (ఈసీపీ) ప్రకారం 272 జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నాలుగు ప్రొవిన్షియల్‌ అసెంబ్లీలకు (పంజాబ్‌, సింధ్‌, బలూచిస్తాన్‌, ఖైబర్‌ పంక్త్వా) జరుగుతున్న ఎన్నికల్లో 577 జనరల్‌ సీట్లకు 8,396 మంది పోటీ చేస్తున్నారు.

3. మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఎన్నికల నిర్వహణలో సైన్యం జోక్యం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఎన్నికల భద్రత కోసం 4,49,465 పోలీసులను, 3,70,000 మిలటరీ సిబ్బందిని వినియోగిస్తున్నామని పాక్‌ ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

4. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు.  కాగా, కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మేజిక్‌ ఫిగర్‌ 172 సీట్లు.

5. మిలటరీకి మెజిస్టీరియల్‌ అధికారాలు కట్టబెడుతూ పాక్‌ సుప్రీం కోర్టు ఇటీవల తీర్వునివ్వడం ఆందోళన కలిగిస్తున్నది. కాగా, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ బజ్వా మాత్రం.. ఎన్నికలు సజావుగా జరగడానికి మిలటరీ సిబ్బందిని వాడుతున్నామనీ, ఎన్నికల నిర్వహణలో మిలటరీ జోక్యం ఏమాత్రం ఉండదని అంటున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నామన్నారు.

6. ఎన్నికల్లో ఓటర్లు విస్తృతంగా పాల్గొనడానికి వీలుగా బుధవారం పాకిస్తాన్‌లో సెలవు ప్రకటించారు. 

7. ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకుంటోందని పాకిస్తాన్‌ మిలటరీ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌-తెహ్రీకే-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధికారంలోకి వస్తే ఆ దేశ విదేశాంగ విధానంలో సంపూర్ణ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

8. ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేక పోయారు. రెండు సార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టిన నవాజ్‌ షరీఫ్‌ పనామా పత్రాల కుంభకోణం కేసులో పదవి కోల్పోయారు. తన కూతురు మరియంతో కలిసి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

9. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ తాజా ఎన్నికల్లో ఉగ్రవాదులు పోటీచేస్తుండడం ప్రజాస్వామ్యవాదులను కలవపపెడుతున్నది. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. 

10. ఎన్నికల రోజు (బుధవారం) జరిగిన ఆత్మాహతి దాడిలో 28 మంది చనిపోగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులే లక్ష్యంగా 10 రోజుల క్రితం బలూచిస్తాన్‌లో జరిగిన బాంబు దాడిలో 151 మంది మృత్యువాత పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement