ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. దీంతో ఫలితాల వెల్లడి మరింత ఆలస్యం కానుంది. అయితే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఆరోపిస్తోంది.
ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘటనలు ఎదురైనప్పటికీ పాకిస్థాన్ ప్రజలు తమవైపే నిలిచినట్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేర్కొంది. ప్రతి ఫలితం తామే అఖండ మెజారిటీతో గెలవబోతున్నట్లు సూచిస్తున్నాయంది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో తమ పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఫారం 45 కాపీల ప్రకారం తాము అధిక మెజారిటీతో గెలుపొందబోతున్నట్లు పీటీఐ పార్టీ పేర్కొంది. అయితే, రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47 ఉపయోగించి ఫలితాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించింది.
ఈమేరకు పీటీఐ పార్టీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ ప్రజల స్పష్టమైన తీర్పును తారుమారు చేస్తున్నారని ప్రపంచమంతా తెలుసుకోవాలి. ఎన్నికలకు ముందు రిగ్గింగ్, అణచివేత సంఘనలు జరిగిప్పటికీ, పోలింగ్ రోజున భారీ ఓటింగ్ జరిగింది. ప్రతి ఫలితం పీటీఐ భారీ గెలుపును సూచిస్తోంది. ఫారం 45లే ఎన్నికల ఫలితాలకు ప్రాథమిక మూలం. మా పోలింగ్ ఏజెంట్లు అందుకున్న ఆ ఫారం కాపీలు మేము భారీ మెజారిటీతో గెలిచినట్లు చూపుతున్నాయి. అయితే రిటర్నింగ్ అధికారులు ఇప్పుడు ఫారం 47లతో ఫలితాలను తారుమారు చేస్తున్నారు" అని పేర్కొంది.
పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి నకిలీ ఫారం 45లపై సంతకం చేయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని పీటీఐ పార్టీ ఆరోపించింది. రిగ్గింగ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెలిపింది. రిగ్గింగ్ ఎన్నికలను పాకిస్థాన్ ప్రజలు అంగీకరించరని పేర్కొంది.
ఫలితాల ట్రెండ్స్‌లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ జోరు
నెమ్మదిగా విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ పార్టీ జోరు కనబరుస్తోంది. ప్రస్తుతానికి విడుదలైన ఫలితాల్లో ఇమ్రాన్ ఖాణ్ పార్టీ ఐదు స్థానాల్లో గెలిచి ముందంజలో ఉంది. నవాజ్ షరీఫ్ పీఎంఎల్ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఒక స్థానం ఆధిక్యంలో ఉంది.
కాగా, పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా, 266 స్థానాలకు మాత్రమే నేరుగా ఎన్నికలు నిర్వహించగా 265 చోట్లే పోలింగ్ జరిగింది. కనీసం 133 సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. మిగతా 70 సీట్లను మైనార్టీలు, మహిళలకు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment