కరాచీ: ఎన్నికల పందేరంలో కోట్లు పంచైనా సరే ఓట్లు ఒడిసిపట్టాలనే నేతలున్న ఈ కాలంలో నువ్వే గెలిచావని ఎన్నికల సంఘం చెబుతున్నా ఒక పాకిస్తాన్ నేత ‘నాకు ఇలాంటి గెలుపు వద్దే వద్దు’ అని తెగేసి చెప్పారు. రిగ్గింగ్‌కు పాల్పడటం ద్వారా తనను గెలిపించారని, వాస్తవానికి విజేత వేరే ఉన్నారని కుండబద్దలు కొట్టారు. సంక్షుభిత పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికలతోపాటు నాలుగు ప్రావిన్షియల్(అసెంబ్లీ) ఎన్నికలు జరిగాయి.
వాణిజ్య రాజధాని కరాచీ నగరంలో పీఎస్–129 నియోజకవర్గం నుంచి జామాతే ఇస్లామీ పార్టీ అభ్యర్థి హఫీజ్ ఉర్ రెహ్మాన్ పోటీకి నిలబడ్డారు. అవినీతి కేసుల్లో జైలుపాలైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ నేత, స్వతంత్ర అభ్యర్థి సైఫ్ బారీ కూడా ఇదే స్థానంలో బరిలో నిల్చారు. సైఫ్‌కు 31,000 ఓట్లు రాగా, రెహ్మాన్‌కు 26,000 ఓట్లు పడ్డాయి. అయితే పీటీఐ నేతను ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
సైఫ్‌కు కేవలం 11,000 ఓట్లు పడ్డట్లు ఫలితాల్లో వచ్చేలా చేశారు. ఇదే ఫలితాలను పాక్ ఎలక్షన్ కమిషన్ అసలైనవిగా భావించి రెహా్మన్‌ను విజేతగా ప్రకటించింది. రిగ్గింగ్ విషయం తెల్సి రెహా్మన్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేకంగా పత్రికా సమావేశం పెట్టిమరీ తన ధర్మాగ్రహాన్ని వ్యక్తంచేశారు. ‘‘ అన్యాయంగా నన్ను ఎవరైనా గెలిపించాలనుకుంటే అందుకు నేను అస్సలు ఒప్పుకోను. ప్రజాతీర్పును గౌరవించాల్సిందే. విజేతనే గెలవనివ్వండి.
రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి ఓటమిని చవిచూడాల్సిందే. అలాంటి వారికి ఎక్స్‌ట్రాలు అక్కర్లేదు. నేను ఈ గెలుపును స్వీకరించట్లేను. విజేతకే విజయం దక్కాలి’’ అని అన్నారు. రెహ్మాన్ నిజాయతీ చూసి అక్కడి వాళ్లు మెచ్చుకున్నారు. అయితే ఈ ఉదంతంపై పాక్ ఎన్నికల సంఘం మరోలా స్పందించింది. ‘‘ రిగ్గింగ్ అవాస్తవం. ఇలాంటి ఫిర్యాదులపై దృష్టి పెడతాం’’ అని పేర్కొంది. ఈ ఘటనపై త్వరలోనే స్పందిస్తామని పీటీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment