ఇమ్రాన్ ఖాన్ (పాత చిత్రం)
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్–ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చాలా బాగా నటిస్తున్నారని, ఆయన నటన ముందు ఫిల్మ్ స్టార్స్ కూడా పనికిరారని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న నేషనల్ అసెంబ్లీతోపాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం ఓ ర్యాలిలో మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో ఒక్క అమెరికా డాలర్ మన 5 రూపాయలకు సమానం. ఇప్పుడు 130 పాక్ రూపాయలైంది. కానీ షరీఫ్ కుటుంబం మాత్రం దేశాన్ని దోచుకుని విదేశాలకు వెళ్లిపోయిందని’ పేర్కొన్నారు.
పాకిస్తాన్‌లో పరిస్థితులు మెరుగు పడాలంటే పీటీఐకి ఓట్లేసి విజయాన్ని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. ఎన్నికల నేపథ్యంలో తాను అమాయకుడినని తెలియ జెప్పేందుకు నవాజ్ షరీఫ్ చాలా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. అదియాలా జైల్లో తమను దోమలు కుడుతున్నాయని షరీఫ్, ఆయన కూతురు మర‍్యమ్ చెబుతున్నారని.. ఏసీల సౌకర్యం లేకపోతే వారు ఉండలేరని ఈ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వారిద్దరూ చాలా బాగా నటిస్తున్నారని, సినిమాల్లో సైతం మనం ఇలాంటి నటనను చూడలేమన్నారు.
పాకిస్తాన్‌లోని ఇతర ప్రావిన్స్‌ల కంటే కూడా కైబర్ కనుమలో విద్యావ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కైబర్‌లో అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని, 9 వేల మంది డాక్టర్లు ఉన్నారని తెలిపారు. 50 కొత్త కాలేజీలు, 10 యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత అసిఫ్ అలీ జర్దారీపై పలు ఆరోపణలు రావడం, పీఎంఎల్–ఎన్ నేత షరీఫ్ జైల్లో ఉండటం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment