
బీజేపీ సర్కార్ వైఖరితోనే భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయని పీటీఐ చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
ఇస్లామాబాద్ : భారత్‌లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాకిస్తాన్ వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. కశ్మీర్‌లో వారు (భారత్) చేస్తున్న దురాగతాలకు పాకిస్తాన్‌ను నిందించాలని మోదీ భావిస్తుండటంతో భారత ప్రభుత్వం ఈ వైఖరిని అనుసరిస్తోందని దుయ్యబట్టారు. భారత్‌తో సంబంధాలను చక్కదిద్దేందుకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎన్నో ప్రయత్నాలు చేశారని, చివరికి ప్రధాని మోదీని ఆయన తన ఇంటికి రావాలని ఆహ్వానించారని చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్‌ను ఒంటరి చేయాలనే విధానాన్ని అనుసరిస్తూ భారత్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇరు దేశాల మధ్య సంబంధాలను దిగజార్చిందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. కాగా పాక్‌లో ఏ పార్టీ సుపరిపాలన అందించలేకపోతున్న క్రమంలో ప్రభుత్వంపై మిలటరీ ప్రభావం ఉందని అంగీకరించారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిన సందర్భాల్లో ప్రజలు సైన్యాన్ని పాలనా పగ్గాలు చేపట్టాలని ఆహ్వానిస్తారని అన్నారు. జులై 25న జరగనున్న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ప్రత్యర్థి పార్టీలకు దీటైన పోటీనిస్తుందని భావిస్తున్నారు.