ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఫలితాలను శుక్రవారం ఉదయం పాక్ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 272 సీట్లకుగానూ జరిగిన ఎన్నికల్లో ఇప్పటిదాకా వెలువడ్డ ఫలితాలు 251. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ 110 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 63, బిలావల్ భుట్టో(బెనజీర్ భుట్టో తనయుడు) పార్టీ పీపీపీ 39, ఇతరులు 50 స్థానాలను కైవసం దక్కించుకున్నారు. మరో 20 స్థానాల ఫలితాల్లో కౌంటింగ్ ఇంకా కొనసా...గుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 137. ఇతరుల సాయంతో పీటీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ప్రధాని బరిలో ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం పీటీఐ వర్గాలు స్పందించలేదు. బుధవారం సాయంత్రం నుంచి కౌటింగ్ కొనసాగుతూనే ఉండగా.. సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగిందని ఈసీ స్పష్టత ఇచ్చింది. అయితే ఇమ్రాన్ ఖాన్ అనుచరులు అవకతవకలకు పాల్పడ్డాడని, భారీ ఎత్తున్న రిగ్గింగ్ జరిగిందని మిగతా పార్టీలు విమర్శిస్తుండగా.. ఎన్నికల సంఘం మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా.. 272 స్థానాలకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. మహిళలకు కేటాయించిన 60 సీట్లు, మైనారిటీలకు కేటాయించిన మరో 10 సీట్లకు పరోక్ష పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే భారీ విక్టరీపై గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఇమ్రాన్ ఖాన్.. సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్‌తో దౌత్య సంబంధాలు, అమెరికా జోక్యంసహా పలు అంశాలపై స్పందించారు కూడా.
14 మంది రెడీ... 14 మంది స్వతంత్ర్యులు తాము పీటీఐ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వటంతో రాయబారాలు నడుస్తున్నాయి. పీటీఐ కీలక నేతలు జహంగీర్ తరీన్, చౌదరి సర్వర్‌లు సంప్రదింపులు నడుపుతున్నారు. రేపు సాయంత్రంలోపు ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఇమ్రాన్‌పై ముషార్రఫ్ ప్రశంసలు.. ఇదిలా ఉంటే పాక్ మాజీ నియంతాధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇమ్రాన్ ఖాన్‌పై ప్రశంసలు గుప్పించారు. మతవ్యతిరేక కూటములకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని, ఇమ్రాన్ ఖాన్ సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలడన్న నమ్మకం ఉందని ముషార్రఫ్ కొనియాడారు. మరోవైపు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతోపాటు పలువురు ప్రముఖులు ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment