ఇమ్రాన్‌ ఖాన్‌ గెలిస్తే పక్కలో తుపాకే! | Pakistan election Will Imran Khan Win In Elections | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 24 2018 8:28 PM | Last Updated on Tue, Jul 24 2018 8:32 PM

Pakistan election Will Imran Khan Win In Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తాలిబన్‌ ఖాన్, ముల్లా ఖాన్‌గా ముద్ర పడిన ‘తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’  పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే అది అటు పాకిస్థాన్‌కు, ఇటు భారత్‌కు అంత మంచిది కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు పలు టెర్రరిస్టు సంస్థల నాయకులతో అవినాభావ సంబంధం ఉండడం వల్ల టెర్రరిస్టులు భారత్‌కు వ్యతిరేకంగా మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కశ్మీర్‌ మరింత కల్లోలం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇప్పటికే పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్, సైన్యం, ఐఎస్‌ఐ మద్దతుగల ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎక్కడికక్కడ విచారించి శిక్షలు విధించే జుడీషియల్‌ అధికారాలను పాక్‌ సైన్యానికి కట్టబెడుతూ పాక్‌ సుప్రీం కోర్టు ఇటీవల అసాధారణ ఉత్తర్వులు జారీ చేయడం రెండు వ్యవస్థల మధ్య నెలకొన్న బంధాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని గుప్పిట్లో పెట్టుకున్న పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ మున్ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకొని వ్యవహరించే ప్రమాదం ఉంది. 

మరోవైపు ఐక్యరాజ్య సమితి నిషేధించిన హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ నాయకుడు మౌలానా ఫజ్లూర్‌ రెహమాన్‌ ఖలీల్‌తోపాటు, లష్కరే తోయిబా మద్దతుగల మిల్లీ ముస్లిం లీగ్, అహ్లే సున్నావాల్‌ జమాత్, బరేల్వి సున్నీ ఇస్లామిస్ట్‌ గ్రూప్, తెహ్రీక్‌ లబ్బాయిక్‌ యా రసూల్‌ అల్లా లాంటి తీవ్రవాద సంస్థల నాయకుల మద్దతు ఇమ్రాన్‌ ఖాన్‌కు ఉందని ‘భారత రీసర్జ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా)’ మాజీ చీఫ్‌ విక్రమ్‌ సూద్‌ ఇటీవలనే తాను ప్రచురించిన ‘ది అన్‌ఎండింగ్‌ గేమ్‌: ఏ ఫార్మర్‌ ఆర్‌ అండ్‌ ఏడబ్లూ చీఫ్సీ ఇన్‌సైట్‌ ఇన్‌టూ ఎస్పియోనేజ్‌’ పుస్తకంలో వెల్లడించారు. పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ను ఎన్నుకుంటే పక్కలో బల్లెంలా కాకుండా తుపాకీలా ఉంటాడని ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మిన్‌హాజ్‌ మర్చంట్‌ లాంటి వాళ్లు అభివర్ణిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement