ముంబై: తొలిసారిగా ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రావడంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఓ మహా ఉత్సవం మాదిరిగా నిర్వహించేందుకు నానాతంటాలూ పడుతోంది. దాదాపు 40 వేలమంది అతిథులు రానుండడంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందు అశోక్ హండే నేతృత్వంలోని బృందం సంగీత విభావరి నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి లతామంగేష్కర్, అమితాబ్‌బచ్చన్‌లతోపాటు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు రానుండడంతో స్టేజీకి రూపకల్పన చేయడం కోసం ప్రముఖ కళాదర్శకుడు నితిన్ దేశాయ్‌ని రంగంలోకి దింపింది. సముద్రతీరం వద్ద వికసించిన కమలాన్ని ఏర్పాటు చేయనుంది.దీంతోపాటు వేదిక సమీపంలో భారీ ఎల్‌ఈడీ తెరను కూడా అమర్చనుంది. శివాజీ మహారాజు ప్రతిమను కూడా ఉంచనుంది.
ప్రమాణ స్వీకారానికి ‘వాంఖడే’ ఉచితం
ప్రమాణ స్వీకారోత్సవ వేదికగా వాంఖడే స్టేడియంను వాడుకుంటున్నందుకుగాను శరద్‌పవార్‌నేతృత్వంలోని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) బీజేపీ వద్ద ఎటువంటి చార్జీ వసూలు చేయడం లేదు. ఈ విషయాన్ని ఎంసీఏ సంయుక్త కార్యదర్శి నితిన్ దయాళ్ వెల్లడించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినందువల్లనే మేము వారి వద్దనుంచి ఎటువంటి చార్జీ వసూలు చేయబోవడం లేదన్నారు.
ప్రమాణ స్వీకారోత్సవం కోసం స్టేడియంలో అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వాధీన్ క్షత్రియ తమను కలిశాడన్నారు. ఈ నెల 31వ తేదీన ఈ స్టేడియంలో బీజేపీ తొలి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి విదితమే. సాధారణంగా ప్రమాణ స్వీకారోత్సవాలు రాజ్‌భవన్‌లోనే జరుగుతాయి. అయితే 1995లో మనోహర్ జోషి నేతృత్వంలోని కాషాయకూటమి ప్రభుత్వం శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే.
మహోత్సవం మాదిరిగా ప్రమాణ స్వీకారం
Published Thu, Oct 30 2014 12:01 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM