ఎవరికి ఏ శాఖ దక్కేనో?
సాక్షి, ముంబై: ఎట్టకేలకు బీజేపీ, శివసేన మధ్య ఒప్పందం కుదిరింది. శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం పది గంటలకు బీజేపీకి చెందిన 10 మంది, శివసేనకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వీరిలో ఎవరికి ఏ శాఖ అప్పగిస్తారనేది ఇప్పటిదాకా స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పైరవీలు ప్రారంభించారు. కాగా బీజేపీ సర్కారులో చేరాలా? వద్దా? అనే అంశాన్ని దాదాపు నలభై రోజులకుపైగా శివసేన నాన్చింది. పదవుల పంపిణీపై ఆ పార్టీ తగ్గడం బీజేపీ సర్కారుకు ఊరట లభించింది. శివసేనకు ఐదు కేబినెట్ హోదా, ఏడు సహాయ మంత్రి పదవులను ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే ఈ పదవులు ఎవరిని వరిస్తాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ పదవుల విషయంలో సుభాష్ దేశాయి, ఏక్‌నాథ్ షిండే, దివాకర్ రావుతే, నీలం గోరే పేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి.
అదేవిధంగా సహాయ మంత్రి పదవుల విషయంలో దాదా భుసే, విజయ్ అవుటీ, రవీంద్ర వైకార్, గులాబ్‌రావ్ పాటిల్, సంజయ్ రాఠోడ్, అర్జున్ ఖోత్కర్, దీపక్ కేసర్కర్ లేదా ఉదయ్ సామంత్, దీపక్ సావంత్ తదితరుల పేర్లు తెరపైకొచ్చాయి. దీంతో శివసేనతోపాటు బీజేపీలో కూడా భారీగా లాబీయింగ్ జరుగుతోంది. శివసేన ముందుగా డిమాండ్ చేసిన ప్రకారం ఉప ముఖ్య మంత్రి, హోం శాఖ లాంటి కీలక శాఖలను బీజేపీ ఇవ్వలేదు. కేవలం సాధారణ శాఖలతోనే సరిపెట్టింది. ఈ విషయంలో శివసేన విఫలమైందని కాంగ్రెస్, ఎన్సీపీలు విమర్శిస్తున్నాయి. అయితే శివసేనకు ప్రాధాన్యం లేని శాఖలను కేటాయించామనుకోవడం పొరబాటేనంటూ బీజేపీ సమర్థించుకుంది. ఎమ్మెస్సార్డీసీ, రవాణా లాంటి కీలకమైన శాఖలను శివసేనకు ఇవ్వనున్నారు. వీటితోపాటు కేంద్రంలో ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కావాలని శివసేన డిమాండ్ చేసింది. దీనిపై బీజేపీ నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందనా లేదని శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ పేర్కొన్నారు.
ప్రతిపక్ష హోదా ఎవరికో?
బీజేపీ సర్కారులో శివసేన చేరడం ఖాయమని తేలడంతో ఇక ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారనే అంశం తెరపైకి వచ్చింది. సంఖ్య బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్‌కు 42, ఎన్సీపీకి 41 మంది ఎమ్మెల్యేలున్నారు. దీంతో ప్రతిపక్ష స్థానం కాంగ్రెస్‌కు దక్కే అవకాశం మెండుగా ఉంది. అయితే ఎన్సీపీ కూడా ప్రతిపక్ష స్థానంలోనే ఉంటామంటోంది. ఇటీవల గవర్నర్ విద్యాసాగర్‌రావును తోపులాటల్లో గాయపర్చిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండయ్యారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 37కి చేరింది. ఈ లెక్కప్రకారం ఎన్సీపీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశముంది. స్వతంత్రులు, ఇతర పార్టీల బలం తమకుందని, అందువల్ల ప్రతిపక్షంలో తామే కొనసాగుతామంటూ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎన్సీపీ కూడా ఈ పదవిని ఆశిస్తుండడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది.
ఫలించని ఎన్సీపీ వ్యూహం
శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మాజీ మిత్రపక్షమైన శివసేనను ఇరకాటంలో పడేసేందుకు ఎన్సీపీ యత్నించింది. ఇందులోభాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు బయట నుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఆ తరువాత అనేక సందర్భాల్లోనూ ఇదే మాట చెప్పారు. అయితే పక్షం రోజుల్లోనే ఆయన మాట మార్చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచడం తమ బాధ్యత కాదన్నారు. ఆ తరువాత రెండు రోజులకే మరోసారి ఓ సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని అనడం ద్వారా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. బీజేపీ సర్కారులో చేరడానికి శివసేన అంగీకరించడంతో ఎన్సీపీ వ్యూహం తల్లకిందులైంది.
శాసనసభ ప్రాంగణంలో ఐదున ప్రమాణ స్వీకారం
Published Thu, Dec 4 2014 4:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement