జార్ఖండ్ సీఎంగా రఘువర్‌దాస్ ప్రమాణం
మంత్రులుగా మరో నలుగురు కూడా..
పొగమంచు వల్ల హాజరుకాలేకపోయిన ప్రధాని
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రఘువర్‌దాస్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని బిర్సాముండా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రఘువర్‌దాస్‌తో పాటు మరో నలుగురితో మంత్రులుగా ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణం చేయించారు. వీరిలో బీజేపీ తరఫున నీల్‌కాంత్‌సింగ్ ముండా, చంద్రేశ్వర్‌ప్రసాద్ సింగ్, లూయిస్ మరాండీ, మిత్రపక్షం అల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏఎస్‌జేయూ) నుంచి చంద్రప్రకాశ్ చౌదరి ఉన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తదితరులు రావాల్సి ఉన్నా... ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలను నిలిపివేయడంతో హాజరుకాలేకపోయారు. ఈ విషయాన్ని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రఘువర్‌దాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అవినీతిరహిత అభివృద్ధి సాధిస్తాం
రాంచీ: అవినీతికి తావులేని అభివృద్ధి పనులను చేపడతామని, ప్రభుత్వ సేవలను నిర్ధిష్టమైన కాలపరిమితితో అందిస్తామని జార్ఖండ్ సీఎం రఘువర్‌దాస్ చెప్పారు. జవాబుదారీతనంతో కూడిన బాధ్యతాయుతమైన అధికార యంత్రాంగానికి ఈ అభివృద్ధి పనులను అప్పగిస్తామన్నారు. ఆదివారం ప్రమాణస్వీకారం తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జార్ఖండ్‌కు ఇప్పటి వరకూ అంతమంచి పేరు లేదని, దీనిని తొలగించాలంటే అందరి సహకారం అవసరమని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మీడియా కూడా దీనికి సహకరించాలని కోరారు.
స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న కొత్త సీఎం
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన కొద్దిసేపటికే రఘువర్‌దాస్ స్వచ్ఛభారత్ అభియాన్‌లో పాలుపంచుకున్నారు. గిరిజనులు ఎక్కువగా నివసించే కరంతోలి ప్రాంతంలోని రోడ్లను ఊడ్చారు. ప్రమాణస్వీకారం అనంతరం మంత్రివర్గ సభ్యుడు సీపీ సింగ్‌తో కలసి ఆయన నేరుగా కరంతోలి ప్రాంతానికి చేరుకున్నారు.
సంక్షేమ పథకాల కింద వృద్ధులకు పింఛన్లు, ఇతర సదుపాయాలు అందడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఈ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించానని చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశంలో వృద్ధులందరికీ పింఛన్లు, ఇతర సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.