ముగిసిన ఎంపీల ప్రమాణం
మంత్రులను పరిచయం చేసిన మోడీ
న్యూఢిల్లీ: నూతన లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసింది. గురువారం రికార్డు స్థాయిలో ఏకంగా 510 మంది ఎంపీలు ప్రమాణం చేయడం తెలిసిందే. మిగతా వారిలో అత్యధికులు శుక్రవారం ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీ బి.వి.పాటిల్, టీడీపీకి చెందిన నరమల్లి శివప్రసాద్ తదితరులు వీరిలో ఉన్నారు. ఆర్జేడీకి చెందిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్, ఆయన భార్య రంజిత్ రంజన్ (కాంగ్రెస్) ప్రమాణం కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచారు. మొత్తం వ్యవహారాన్ని సజావుగా జరిపించారంటూ ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్, లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్‌లను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. ఒకే రోజులో ఏకంగా 510 మందితో ప్రమాణం చేయించడం ద్వారా శ్రీధరన్ రికార్డు సృష్టించారన్నారు. స్పీకర్ ఎన్నిక జరిగిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సభ్యులను లోక్‌సభకు పరిచయం చేశారు. విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) పీయూష్ గోయల్ మినహా రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితర 43 మంది మంత్రులనూ పేరుపేరునా పరిచయం చేశారు. ఆ క్రమంలో నిజానికి గోయల్ పేరును కూడా మోడీ పిలిచారు. ఆయన సభలో లేరంటూ కాంగ్రెస్ సభ్యులంతా గట్టిగా అరవడంతో, అలాగైతే ఆయనను మరోసారి పరిచయం చేస్తానన్నారు.
పాల్ తడబడ్డ వేళ...
బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ప్రమాణస్వీకారం సందర్భంగా తడబడ్డ వైనం సభలో నవ్వులు పూయించింది. అందరి మాదిరిగానే ఆయనకు కూడా లోక్‌సభ సిబ్బంది ప్రమాణ పాఠం ప్రతిని అందించగా, వద్దంటూ తిరస్కరించి సొంతగానే ప్రమాణం చేయడం మొదలు పెట్టారు. కానీ కొంతమేరకు పలికాక ఆపై గుర్తుకు రాక నీళ్లు నమిలారు. చివరికి సిబ్బందిని పిలిచి ముద్రిత ప్రతిని అడిగి తీసుకుని, దాంట్లో చూస్తూ ప్రమాణం పూర్తి చేయాల్సి వచ్చింది. ఆయన పాట్లను ఇతర సభ్యులు ఆద్యంతం నవ్వుతూ గమనించారు. చాలాకాలం పాటు కాంగ్రెస్‌లో ఉన్న పాల్ ఇటీవలి ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని దోమరియాగంజ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ విషయమై అంతకుముందు ఉదయం కూడా సభలో పలువురు సభ్యులు పాల్‌ను సరదాగా ఆట పట్టించడం కన్పించింది. ‘ఏమండీ పాల్ గారూ! మీరిప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సరదాగా అడిగారు. దానికాయన ‘మీ పార్టీలోనే’ అంటూ అంతే సరదాగా బదులిచ్చారు. ఎంతైనా మీరు ఒక్క రోజు ముఖ్యమంత్రి కదా అంటూ పాల్‌ను బెనర్జీ మరింతగా ఆటపట్టించి అందరినీ నవ్వించారు