'పార్లమెంట్ చరిత్రలో చీకటి అధ్యాయం'
న్యూఢిల్లీ: విభజనకు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంపై సీమాంధ్ర ప్రాంత నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లుకు ఆమోదం తెలిపిన తీరును తప్పుబట్టారు. దేశ ప్రజలను చీకట్లోఉంచి లోక్‌సభ నడిపిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు విమర్శించారు. పార్లమెంట్ చరిత్రలో ఈ రోజు చీకటి అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నిరకుశంగా పనిచేస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్దంగా కాంగ్రెస్ వ్యవహరించిందని మండిపడ్డారు.
పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సీమాంధ్రుల గొంతుకోసిందని టీడీపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. సీమాంధ్రులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరు తమకు శత్రువులేనని వ్యాఖ్యానించారు. సీమాంధ్రులకు ఈ పార్లమెంట్ ద్రోహం చేసింది, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని చెప్పారు. ఈ పార్లమెంట్లో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని మరో ఎంపీ ఎన్ శివప్రసాద్ అన్నారు.