మైత్రీబంధం! | Most SAARC leaders coming, Modi's first bilateral meetings | Sakshi
Sakshi News home page

మైత్రీబంధం!

Published Wed, Jun 18 2014 1:10 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Most SAARC leaders coming, Modi's first bilateral meetings

సంపాదకీయం: తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ద్వారా ఇరుగుపొరుగుతో సాన్నిహిత్యానికి ఇస్తున్న ప్రాముఖ్యతను తెలియజెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ... ఇప్పుడు తొలి విదేశీ పర్యటనకు హిమాలయ సానువుల్లో కొలువుదీరిన భూటాన్‌ను ఎంచుకుని దాన్ని మరింత దృఢంగా చాటారు. ప్రపంచంలోనే ఏకైక బౌద్ధ దేశమైన భూటాన్ పర్యావరణ పరిరక్షణను లాంఛనప్రాయంగా కాక తన పవిత్ర కర్తవ్యంగా, తన నైతిక బాధ్యతగా గుర్తిస్తున్నది. మన పూర్వీకులు మనకిచ్చిపోయిన ఈ ప్రకృతి సంపద రానున్న తరాలది కూడా అనే తత్వాన్ని నిలువెల్లా ఒంటపట్టించుకుని అందుకోసమని ఒక యజ్ఞంలా దేశంలోని కొండలను, లోయలను, అరణ్యాలను పరిరక్షించుకోవడంలో అది ముందుంటున్నది. 2005లో భూటాన్ రాజు స్వచ్ఛందంగా దేశాన్ని రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంవైపు నడిపించారు.
 
 అందుకనుగుణంగా 2008లో ఆ దేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రపంచ పటంలో వెతుక్కుంటేగానీ దొరకనంత చిన్నదిగా ఉండే ఆ దేశాన్ని తన తొలి విదేశీ పర్యటనకూ, ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకూ ఎంచుకున్నప్పుడు ఈ విశిష్టతలన్నిటినీ మోడీ గమనంలోకి తీసుకునే ఉంటారు.
  భూటాన్‌తో మన అనుబంధం దశాబ్దాలనాటిది. ఈ అను బంధంలో చిన్న చిన్న అపశ్రుతులొచ్చిన మాట వాస్తవమే. పరస్పర అవిశ్వాసం ఏర్పడిన మాటా వాస్తవమే. కానీ మన దేశం కాస్త విశాల దృష్టితో, ముందుచూపుతో వ్యవహరించివుంటే ఈ అపశ్రుతులనూ, ఈ అవిశ్వాసాన్నీ జయించడం పెద్ద కష్టమయ్యేది కాదు. యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాలనూ అస్తవ్యస్థం చేసినట్టే భూటాన్‌తో ఉన్న చిరకాల స్నేహానికి కూడా చిల్లులు పొడిచే చర్యకు దిగింది. నిరుడు అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా హ ఠాత్తుగా ఆ దేశానికిచ్చే ఇంధన సబ్సిడీలను మన ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
 
 దీంతో వంటగ్యాస్, కిరోసిన్ ధరలు రెట్టింపై భూటాన్ ప్రజలు విలవిల్లాడారు. భారత్ అంటే ప్రాణంపెట్టే ఆ దేశంలో సామాన్యులు సైతం ఈ చర్యతో ఎంతగానో నొచ్చుకున్నారు. భూటాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కాలపరిమితి ముగిసి సబ్సిడీలన్నీ వాటికవే నిలిచిపోయాయని ఆనాటి మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సర్దిచెప్పబోయినా అది వాస్తవ పరిస్థితికి అతకలేదు. ఆ దేశం చైనాతో చెలిమికి ప్రయత్నిస్తున్నదన్న శంకే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యం. 2007 వరకూ ఇరుదేశాల మధ్యా అమలులో ఉన్న స్నేహ ఒడంబడిక ప్రకారం అది భారత్ ఆమోదించిన 21 దేశాలతో మాత్రమే దౌత్య సంబంధాలను ఏర్పర్చుకుంది. మన దేశానికి తలనొప్పిగా మారిన అల్ఫా స్థావరాలను ధ్వంసంచేసి తమ గడ్డను మిలిటెంట్ కార్యకలాపాలకు అడ్డాగా మారనివ్వబోమని స్పష్టంచేసింది. దానికి ఉత్తర సరిహద్దుల్లో చైనాతో సమస్యలున్నాయి కూడా.
 
  ఆ ప్రాంతంలోని చంబీ లోయను తనకు ధారాదత్తం చేయమని చైనా కోరుతున్నా...అందువల్ల తనకొచ్చే సమస్యేమీ లేకపోయినా ఆ పని భారత్‌కు వ్యూహాత్మక సమస్యలు తెచ్చిపెడుతుందన్న భావనతో భూటాన్ అందుకు ససేమిరా అంటున్నది. అయితే, భూటాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డాక ఇరుగుపొరుగుతో సంబంధాలు సమాన గౌరవ ప్రాతిపదికగా ఉండాలన్న ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఎవరు గరిష్టంగా లబ్ధిచేకూరగలరో వారితో చెలిమి చేస్తే తప్పేమిటన్న ప్రశ్నలూ వస్తున్నాయి. అటు చైనా వ్యూహం వేరు. ఈ ప్రాంతంలోని చిన్న చిన్న దేశాలకు భారత్ దూరమవుతున్న తీరును గమనించి అందువల్ల ఏర్పడుతున్న ఖాళీని తాను భర్తీ చేయాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. ఆ రకంగా భారత్‌ను అష్టదిగ్బంధం చేయాలనుకుంటున్నది. కనుకనే భూటాన్‌ను దువ్వుతున్నది. ఒక్క పాకిస్థాన్ మినహాయిస్తే మిగిలిన దేశాలన్నీ దశాబ్దాలుగా భారత్‌కు మిత్రదేశాలుగా ఉంటున్నవే గనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే, పకడ్బందీ దౌత్యవ్యూహంతో ముందుకెళ్తే చైనా కంటే మనకే ఆ దేశాలన్నీ ప్రాముఖ్యతనిస్తాయి.
 
 నరేంద్ర మోడీ దీన్ని సరిగానే గుర్తించారు. అందువల్లే తొలి విదేశీ పర్యటనకు ఘనంగా కనబడే...ప్రచారం అధికంగా వచ్చే అమెరికానో, బ్రిటన్‌నో ఎంచుకోక భూటాన్‌పై దృష్టి సారించారు. సుసంపన్నమైన, సుదృఢమైన భారత్ వల్ల ఇరుగుపొరుగు దేశాలకే అధికంగా మేలు కలుగుతుందన్న సందేశాన్నిచ్చి ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టపరుచుకుందామని పిలుపునిచ్చారు. బియ్యం, గోధుమలు మొదలుకొని వంట నూనెల వరకూ భూటాన్‌కు నిషేధంనుంచి, పరిమితులనుంచి మినహాయింపునిస్తున్నట్టు మన దేశం ప్రకటించింది. అలాగే ఇక్కడ చదువుకునే భూటాన్ విద్యార్థులకిచ్చే ఉపకార వేతనం సొమ్మును రెట్టింపుచేసింది.
 
 ఇరుదేశాల భాగస్వామ్యంతో నెలకొల్పే 600 మెగావాట్ల ఖోలాంగ్సు జల విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేశారు. భూటాన్‌కున్న ప్రధాన ఎగుమతి వనరు జలవిద్యుత్తే. దానికి 24,000 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం ఉంది. అంతేకాదు...హిమాలయ దేశం గనుక మనకు విద్యుత్ అవసరాలుండే వేసవిలో దాన్ని నిరంతరాయంగా సరఫరా చే యగలదు కూడా.  అదే సమయంలో 200 కోట్ల డాలర్ల భూటాన్ ఆర్ధిక వ్యవస్థ మనతో పెనవేసుకుని ఉన్నది. భూటాన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చిన కొత్త ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటూ, అదే సమయంలో మన ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా అరమరికల్లేకుండా చర్చిస్తే, పారదర్శక దౌత్యాన్ని పాటిస్తే స్నేహసంబంధాలు బలపడతాయనడంలో సందేహం లేదు. నరేంద్ర మోడీ పర్యటన ఈ దిశగా ముందడుగని భావించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement