
ఆరోసారి..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శాసనసభాపక్ష నేతగా ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
* శాసనసభాపక్ష నేతగా జయ ఏకగ్రీవం
* 23వ తేదీన సీఎంగా ప్రమాణస్వీకారం
* ప్రధాని మోదీకి ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు గాను తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి మినహా 232 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 134 స్థానాలను గెలుచుకోవడం ద్వారా అన్నాడీఎంకే అధికారం చేపట్టనుంది. పార్టీ అధినేత్రి జయలలిత చెన్నై ఆర్కేనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవగా, ధ్రువీకరణ పత్రాన్ని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్, ఆర్కేనగర్ ఎన్నికల ఇన్‌చార్జ్ వెట్రివేల్ శుక్రవారం పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి ఆమెకు అందజేశారు.
కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశాన్ని రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాల యంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరయ్యేందుకు ముందుగా అన్నాశాలై, అన్నా ఫ్లైవో వర్ సమీపంలోని పెరియార్ విగ్రహానికి జయ నివాళులర్పించారు. ఆ తరువాత అన్నాశాలైలోని ఎంజీఆర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి రాయపేట అవ య్యషణ్ముగం రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. కొత్తగా ఎన్నికైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరై అసెంబ్లీలో శాసనసభా పక్ష నేతగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
23న సీఎంగా పదవీ ప్రమాణం: అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం పూర్తికావడంతో ఈనెల 23వ తేదీ న జయలలిత ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ కే రోశయ్య జయలలితతోపాటు కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ప్రమాణస్వీకారం పూర్తికాగానే జయలలిత అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి బాధ్యతలు చేపడతారు.
ప్రధాని మోదీకి ఆహ్వానం: ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీకి ఆహ్వానం పలికారు. అలాగే కేంద్ర మంత్రులకు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపారు.
చేతలతో కృతజ్ఞతలు చాటుకుంటా: జయలలిత కేవలం నోటి మాటలతో కాదు, ప్రజారంజకమైన పాలనతో తన కృతజ్ఞతలు చాటుకుంటానని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత అన్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికవుతున్న సందర్భంగా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విచక్షణమైన తీర్పుతో ప్రజలు ఒక చరిత్రను సృష్టించారని అన్నారు. తాను ప్రజల పక్షం, ప్రజలు నా పక్షమని మరోసారి రుజువైంది. గత ఐదేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజలు అంగీకార ముద్ర వేశారు.
మీడియా సాధనాల ద్వారా అనేక విపక్ష నేతలు అనేక విషప్రచారాలను చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వంపై విపక్షాల చేసిన విమర్శలను విసిరిపారేశారు. తమిళ ప్రజలను ఎవ్వరూ మోసం చేయలేరని నిరూపించారు. పేద, బడుగు, బలహీన ప్రజలను అక్కున చేర్చుకునేది అన్నాడీఎంకే ప్రభుత్వం మాత్రమేనని ప్రజలు నమ్మినందునే మరోసారి అధికారంలోకి వచ్చాను. మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చాటుకుంటున్నాను. ప్రజల సంక్షేమకోసం ఉద్వేగంతో పాటుపడుతాను. కేవలం మాటలతోకాదు సుపరిపాలనను చేతలతో చూపిస్తాను అని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.