న్యూఢిల్లీ: ఢిల్లీలో 26న జరుగనున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నుంచి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కాబోయే ముఖ్యమంత్రులు కె.చంద్ర శేఖరరావు, నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి పదవుల పంపకాలపై చర్చించేందుకు చంద్రబాబు శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకోగా.. ఆదివారం సాయంత్రం కేసీఆర్, సోమవారం ఉదయం గవర్నర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రముఖులు ముగ్గురు ఒకేమారు వస్తుండటంతో ఢిల్లీలోని ఏపీభవన్ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం బాబు ఢిల్లీకి వెళ్లినా.. ప్రైవేటు హోటల్‌లో దిగి, మధ్యమధ్యలో ఏపీభవన్‌కు వెళ్లి గడిపారు. ఇప్పుడు బాబు కోసం అదే కాటేజ్‌ను సిద్ధం చేశారు. గవర్నర్ కోసం శబరి బ్లాక్‌లోని ఎప్పుడూ బస చేసే గదినే కేటాయించారు. ఇక కేసీఆర్ కోసంశబరి బ్లాక్‌లోనే గవర్నర్ గదికి పైన ఉన్న మూడు గదులను సిద్ధం చేశారు. చంద్రబాబుకు ఇప్పటికే ఏపీభవన్ అధికారులు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించగా... కేసీఆర్ కోసం రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేశారు. గవర్నర్‌కు పాత కాన్వాయ్‌నే కొనసాగించనున్నారు.
బీజేపీ రాష్ట్ర నేతలు కూడా..
హైదరాబాద్: మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నుంచి సీనియర్ నేతలు హాజరవుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంపీ బండారు దత్తాత్రేయ తన కుటుంబసభ్యులతో కలసి ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు మురళీధరరావు, కార్యవర్గ సభ్యుల హోదాలో ఉన్న సీనియర్ నేతలు సీహెచ్.విద్యాసాగర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, వి.రామారావు, నాగం జనార్దనరెడ్డి, శేషగిరిరావు, చంద్రశేఖరరావు, ఎన్.రామచంద్రరావు తదితరులు కార్యక్రమానికి హాజరవుతున్నారు.
మోడీ ప్రమాణ స్వీకారం కోసం హస్తినకు గవర్నర్, బాబు, కేసీఆర్
Published Sun, May 25 2014 2:20 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement