మట్టి.. నీళ్లు తెచ్చా
♦ అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని మోదీ
♦ దేశంలోని పట్టణాల అభివృద్ధికి అమరావతి దిక్సూచి కావాలి
♦ నాటి పాలకులు తొందరపాటుగా రాష్ట్రాన్ని విభజించారు..
♦ విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేస్తాం
(అమరావతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు) : విజయదశమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి తాను కూడా పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకుని వచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. దేశంలోని పట్టణాల అభివృద్ధికి అమరావతి దిక్సూచి కావాలని ఆయన ఆకాంక్షించారు. మంచి నగరాల నిర్మాణానికి గాను దేశంలో 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. గురువారం ఉద్దండరాయుని పాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాత బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. మోదీ హిందీ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలుగులోకి తర్జుమా చేశారు.
కొత్త రాజధాని నిర్మాణానికి దేశ, విదేశాల్లోని పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాల నుంచి పుట్ట మట్టి, నదుల నుంచి నీరు తెప్పిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందనీ, అందుకే తాను కూడా పార్లమెంటు ఆవరణంలోని మట్టిని, పవిత్ర యమునా నది నుంచి నీటిని తెచ్చి సీఎం చంద్రబాబుకు అందించానని మోదీ చెప్పారు. తాను నీరు, మట్టి ఏదో ఆషామాషీగా తీసుకురాలేదని, దేశ రాజధానే మీ రాష్ట్ర రాజధానిలో కలవడానికి వచ్చిందనడానికి ఇది సంకేతమనీ, ఏపీ చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం భుజానికి భుజం కలిపి నడుస్తుందనడానికి ఇది సూచనగా ప్రధాని అభివర్ణించారు.
జపాన్ మంత్రి కొత్త నగరాల ఏర్పాటులో ఉన్న సమస్యలను వివరించిన సమయంలో.. 2001లో గుజరాత్‌లో వచ్చిన భూకంపం తనకు గుర్తుకు వచ్చిందని చెప్పారు. అప్పటి భూకంపం కచ్ జిల్లాలో తీవ్రమైన విధ్వంసం సృష్టించిందని, ఆ సమయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తాను దృఢ సంకల్పం, ప్రజల మద్దతుతో ఆ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
తొందరపాటుతో రాష్ట్రాన్ని విభజించారు
చంద్రబాబు అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించడం సంతోషం కలిగించిందని ప్రధాని అన్నారు. ఆ నాటి పాలకులు రాజకీయ కారణాలతో, సరైన ఆలోచన చేయకుండా తొందరపాటుగా రాష్ట్ర విభజన చేశారని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల ఆత్మ తెలుగేననీ, రెండు రాష్ట్రాల సీఎంలు కలసి పనిచేసి తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుంటే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఏపీకి ఇప్పటికే నిధులిచ్చాం
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అక్షరం తప్పకుండా అమలు చేస్తామని అమరావతి సాక్షిగా చెబుతున్నానని మోదీ అన్నారు. విభజన తర్వాత కూడా కొందరు ప్రజల్లో విషబీజాలు నాటి, భ్రమలు కల్పించే పనిలో ఉన్నారని ప్రధాని ఆరోపించారు.
నేను సైతం..అంటూ తెలుగులో..
అంతకుముందు తాను తెచ్చిన మట్టి, నీరు ఉంచిన కలశాలను ప్రధాని మోదీ వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘నేను సైతం.. ’ కవిత ఈ సందర్భానికి ఉపయుక్తంగా ఉంటుందని చెబుతూ... ‘నేను సైతం ప్రజా రాజధానికి మట్టి సమర్పిస్తున్నాను..’ అంటూ తెలుగులో మాట్లాడారు. ఈ సందర్భంగానూ, ప్రసంగం ప్రారంభించేటప్పుడు.. ‘ప్రియమైన సోదర సోదరీమణులారా నమస్కారం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ’ అంటూ తెలుగులోని అని సభికుల్ని ఆకట్టుకున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కూడా ‘నమస్కారం... అందరికీ విజయదశమి శుభాకాంక్షలు’ అని తెలుగులో అన్నారు.