ముగ్గురిదీ ఒకే రూటు...
రాజకీయవర్గాల్లో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా చంద్రబాబు 88 రోజుల పాటు హైదరాబాద్‌లోని సచివాలయంలో అడుగుపెట్టకుండా రికార్డును సృష్టించారు. మరోవైపు కేసీఆర్ కూడా నెలలో కొన్నిసార్లు మాత్రమే సచివాలయానికి వస్తుండగా, గతంలోనూ వరసగా 30-35 రోజుల పాటు సెక్రటేరియట్‌కు రాని రోజులున్నాయి. ఎక్కువగా సీఎం క్యాంప్ కార్యాలయంలో, ఎంసీఆర్ హేర్‌ఆర్‌డీలలో ఆయాశాఖల పరంగా ముఖ్యమైన సమీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలు కూడా విపక్షాలు చేస్తున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏమాత్రం తీరికలేకుండా క్రమతప్పకుండా విదేశీ పర్యటనల్లో గడుపుతున్నారు. సీఎంలు ఇద్దరూ ఒకరికి తీసిపోకుండా మరొకరు తమ తమ కార్యక్షేత్రాలలో కంటే ఎక్కువగా బయటే గడపడంపై వాస్తు, స్థల ప్రభావం,ఆచార వ్యవహారాల ప్రభావం ఉందని చెవులు కొరుక్కుంటున్నారట.
సచివాలయానికి వాస్తుదోషముందని, దానిని ఎర్రగడ్డలో ప్రస్తుతం ఛాతీఆసుపత్రి ఉన్న ప్రదేశానికి మారుస్తామని కేసీఆర్ ప్రకటించి పెద్ద ఎత్తున విమర్శలురావడంతో వెనక్కు తగ్గిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇంకొకవైపు చంద్రబాబుకు ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు, వాస్తు వంటి వాటిపై ఎక్కడలేని నమ్మకం ఏర్పడిందట. మనవడి పుట్టు వెంట్రుకలు తీయించడం మొదలుకుని అన్ని శ్రద్ధగా పాటిస్తున్నారని, గతంలో ఆచారవ్యవహారాలను పెద్దగా నమ్మని బాబుకు ప్రస్తుత చంద్రబాబుకు పోలికే లేదని అంతర్గత చర్చల్లో తెలుగు తమ్ముళ్లు గుసగుసలు పోతున్నారట. ఇదే విషయం వారిమధ్య చర్చకొచ్చినపుడు... ఇద్దరు చంద్రులేమో సచివాలయం బయట, మోదీనేమో దేశం బయట... అని ఓ నాయకుడు ముక్తాయింపునిచ్చారట.