ఆర్భాటంగా అమరావతి శంకుస్థాపన
♦ ప్రధాని చేతులమీదుగా శాస్త్రోక్తంగా కార్యక్రమం
♦ రత్నన్యాసం.. తదుపరి యంత్రస్థాపనతో ముగిసిన శంకుస్థాపన
♦ అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మోదీ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజకీయ నాయకుల హడావుడి, సాంస్కృతిక సందడి, సినీ స్టార్ల తళుకులు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జన హోరు మధ్య అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగింది. గురువారం ఉదయం 9 గంటలకు యాగశాలలో ప్రత్యేక పూజలతో శంకుస్థాపన మొదలైంది. తొలుత విష్వక్సేన పూజతో ప్రారంభించారు. అనంతరం వాస్తు పూజ, నవగ్రహ మండపారాధాన, లక్ష్మీగణపతి హోమం, సుదర్శన హోమం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్యాహ్నం 12.15 గంటలకు వచ్చేసరికి వేద పండితులు పూజలు చేసి పూర్ణాహుతికి సిద్ధం చేశారు.
మోదీ వచ్చాక ఆయన పూర్ణాహుతి ఇచ్చారు. శంకుస్థాపన చేసేచోట నవరత్నాలు, వెండి, బంగారు నాణేలను వేసి రత్నన్యాసం చేశారు. ఆ తర్వాత యంత్రస్థాపన చేయడంతో శంకుస్థాపన ముగిసింది. ఈ కార్యక్రమం 12.35 గంటల నుంచి 12.40 గంటల మధ్య జరిగింది. తర్వాత 12.45 గంటలకు శంకుస్థాపన శిలాఫలకాన్ని మోదీ ఆవిష్కరించారు. అంతకుముందు అమరావతి ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రధాని తిలకించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కె.చంద్రశేఖరరావు, గవర్నర్ నరసింహన్, తమిళనాడు, అసోం గవర్నర్లు కె.రోశయ్య, పి.వి.ఆచార్య, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనాచౌదరి, బండారు దత్తాత్రేయ, హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బి బొసాలే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పాల్గొన్నారు.
కేసీఆర్‌కు జనం నుంచి భారీ స్పందన..
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావుకు జనం నుంచి భారీ స్పందన లభించింది. ఆయన వేదికపైకి వచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు ప్రజలు చప్పట్లు, అరుపులతో హడావుడి చేశారు. ఆయన చంద్రబాబు గురించి మాట్లాడినప్పుడు, అమరావతి ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్ష వ్యక్తం చేసినప్పుడు జనం చప్పట్ల మోత మోగించారు. ప్రధాని పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నీళ్లు తెచ్చానని చెప్పినప్పుడూ సభికుల నుంచి స్పందన వచ్చింది.