
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
{పొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన జిల్లా ఎమ్మెల్యేలు
వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షంలో కాకాణి, గౌతమ్‌రెడ్డి, కోటంరెడ్డి, అనిల్ కుమార్
నెల్లూరు : జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు గురువారం కొత్త రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభలో ప్రొటెం స్పీకర్ నారాయణస్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన సర్వేపల్లి, ఆత్మకూరు, నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కాకాణి గోవ ర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య ప్రమాణ స్వీకారం చేయగా, టీడీపీకి చెందిన కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, కురుగొండ్ల రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి బస్‌లో అసెంబ్లీకి వచ్చారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు శాసనసభ్యులు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవగా, టీడీపీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీ గడప తొక్కారు.
వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షంలో నలుగురికి చోటు
వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం కార్యవర్గంలో జిల్లాకు చెందిన నలుగురికి చోటు లభించింది. బుధవారం జరిగిన వైఎస్సార్‌సీపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. శాసనసభాపక్షం కార్యదర్శిగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యుడిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, సమన్వయకర్తగా ఆత్మకూరు శాసనసభ్యుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఎన్నుకున్నారు. శాసనసభాపక్షం అధికార ప్రతినిధిగా నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నియమించారు.