రణిల్ విక్రమ సింఘే
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే(67) తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో ద్వీప దేశంలో 51 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి తొలగినట్లయింది. అధ్యక్ష పరిపాలనా భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు సిరిసేన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)నేత విక్రమ సింఘేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం విక్రమ సింఘే మీడియాతో మాట్లాడారు. ‘ఈ విజయం శ్రీలంక ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం, పౌరుల సార్వభౌమత్వానికి లభించిన విజయం. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం కోసం మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రిగా విక్రమ సింఘే ఐదోసారి ప్రమాణం చేసి చరిత్ర సృష్టించడంతో ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. యూఎన్‌పీ, శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)లకు చెందిన 30 మందితో సోమవారం కేబినెట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అధ్యక్షుడు సిరిసేనతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూఎన్‌పీ నేత ఒకరు తెలిపారు. ‘సిరిసేనను కొందరు తప్పుదోవ పట్టించి విక్రమసింఘేకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా చేశారు. విక్రమ సింఘేను తిరిగి నియమించడం ద్వారా సిరిసేన సిసలైన వ్యక్తిత్వం బయటపడింది’ అని ఆయన అన్నారు. విక్రమసింఘే తొలగింపు, పార్లమెంట్ రద్దు వంటి సిరిసేన నిర్ణయాలతో అంతర్జాతీయంగా శ్రీలంక ప్రతిష్ట దెబ్బతింది.
Comments
Please login to add a commentAdd a comment