17న ప్రమాణస్వీకారం లేనట్లే!
‘అప్పీలు’ డిమాండ్లు పెరగడంతో జయ ఊగిసలాట
సాక్షి, చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈనెల 15న శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని భావించిన పార్టీ నేతలు తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. 17వ తేదీన సీఎంగా జయ ప్రమాణస్వీకారం ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలంటూ రాజకీయ పక్షాల డిమాండ్ పెరుగుతుండడమే ఈ ప్రతిష్టంభనకు కారణంగా తెలుస్తోంది. జయలలిత నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం చెప్పారు.
కాగా, 19 ఏళ్లపాటు సాగిన విచారణలో జయ దోషి అని రుజువైతే, 3 నిమిషాల తీర్పుతో ఆమె నిర్దోషి అని ప్రకటించారని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తప్పుపట్టారు. తీర్పును సవరిస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమని పీఎంకే అధినేత రాందాస్ అన్నారు.
ఆందోళనలో జయ: కోర్టు తీర్పుపై విమర్శలు రావడం, అప్పీలుకు విపక్షాలు పట్టుపట్టడం, తీర్పు వెలువరించిన న్యాయమూర్తి కుమారస్వామి సైతం విమర్శలకు స్పందించి అత్యవసరంగా సమావేశం కావడం జయలలితను ఆందోళనకు గురిచేసింది. ఈ కేసు నుంచి బయటపడ్డా జయ.. ఉత్సాహంతో ప్రజల ముందుకు ఇప్పటివరకు రాలేదు. సీఎం పన్నీర్‌సెల్వంతో మాత్రమే ఆమె సమావేశమయ్యారు. తీర్పు వివరాలను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే సీఎం పదవి చేపట్టడంపై ఆమె నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈనెల 17నపదవీ ప్రమాణం లేకున్నా అందుబాటులో ఉండాలని 155 మంది ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందాయి.
తీర్పుపై జడ్జి పునఃసమీక్ష!
జయలలిత ఆస్తుల కేసులో వెలువరించిన తీర్పు ప్రతిలో తప్పులు ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య పేర్కొనడంతో తీర్పుపై న్యాయమూర్తి జస్టిస్ సి.ఆర్.కుమారస్వామి బుధవారం సమీక్షించారు. గురువారం కూడా ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు సమాచారం. జయను నిర్దోషిగా పేర్కొంటూ జస్టిస్ కుమారస్వామి ఈ నెల 11న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు ప్రతిలో తప్పులు నిజమే అయినా.. ఒకసారి ఇచ్చిన తీర్పును తిరిగి అదే కోర్టు మార్చడానికి వీల్లేదని, అయితే క్లరికల్, అర్థమెటిక్ తప్పులను సరిదిద్దడానికి మాత్రం అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.