ముందస్తుకే జయ మొగ్గు!
17న సీఎంగా ప్రమాణ స్వీకారం
14న శాసనసభా పక్ష నేతగా ఎన్నిక
అనంతరం గవర్నర్‌కు తీర్మానం అందజేత
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి విముక్తి పొందిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. జయ సీఎం అయిన ఆరు నెలల్లోగా ఏదో ఒక నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. జయ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆర్నెల్ల తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచి, మరో ఆరు నెలలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవడం అనవసరమని జయలలిత భావించవచ్చు. ఈ నెలలోనే పదవిని చేపట్టి, ఐదు నెలలపాటు సీఎంగా వ్యవహరించి ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవంగా అన్నాడీఎంకే ప్రభుత్వానికి 2016, మే నాటికి ఐదేళ్లు పూర్తవుతుండగా, ఈఏడాది చివర్లో ఎన్నికలు తథ్యమని అంటున్నారు.
14న సీఎం రాజీనామా
ఈనెల 14న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రివర్గం సమావేశమై రాజీనామాలు చేసి గవర్నర్‌కు సమర్పిస్తారని భావిస్తున్నారు. అదేరోజు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభాపక్ష నేతగా జయను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ తీర్మానాన్ని గవర్నర్ కె.రోశయ్యకు అందజేస్తారు. ఆ వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయను గవర్నర్ ఆహ్వానిస్తారు. తమిళనాడు ప్రజలు శుభదినంగా భావించే నిండు అమావాస్య రోజైన ఈనెల 17న జయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అనధికార సమాచారం. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ వెలువరించిన తీర్పు ప్రతులను తమిళనాడు ఏసీబీ ఐజీ గుణశీలన్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే, సీఎం పదవులకు అనర్హురాలిగా జయపై ఉన్న నిషేధం ఎత్తివేసినట్లయింది.
అప్పీలుకు వెళ్తే..?
మరోవైపు హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాల్సిందేనని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. జయ సీఎం పీఠం ఎక్కినట్లయితే మళ్లీ రాజీనామా చేయకతప్పదని సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. అయితే ఆయన్ను బీజేపీ అగ్రనేతలు కట్టడి చేయవచ్చని అంటున్నారు. ఇలాంటి డోలాయమాన స్థితిలో తొందరపడరాదని జయ భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం అప్పీలుకు వె ళ్తే సుప్రీంకోర్టులో సైతం కేసు నుంచి బయటపడి, ఎన్నికల్లో గెలుపొంది ఒకేసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తే బాగుంటుందని కూడా జయలలిత యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘జయ మళ్లీ రాజీనామా చేయాల్సి వస్తుంది!’
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సిద్ధమవుతున్నారు. ‘‘ఈ కేసులో కర్టాటక హైకోర్టు ‘లెక్కలు’ తప్పని నేను సుప్రీంకోర్టులో నిరూపిస్తా. జయలలిత ఒకవేళ సీఎంగా పగ్గాలు చేపడితే మళ్లీ రాజీనామా చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన మంగళవారం ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. జయపై ఈ కేసును 1996లో సుబ్రహ్మణ్య స్వామే దాఖలు చేసిన సంగతి తెలిసిందే.