properties case
-
మ్యుటేషన్ పంచాయితీ..! సమస్య ఏంటి..?
కరీంనగర్: ఇది పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలోని పరిస్థితే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న దుస్థితి. ఆస్తులు తమవే అయినా.. పేర్లు మారకపోవడం.. యజమానులు మరణించడం.. వెరిసి ఏంచేయాలో తెలియక వారసులు సతమతమవుతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అసలేం జరిగింది? ఒకప్పుడు గ్రామాల్లో ఆస్తుల బదిలీ రెండు రకాలుగా జరిగేది. మొదటిది వారసుల పేరు మీదికి.. రెండోది ఇంటిని కొన్న వారి పేర మ్యుటేట్ అయ్యేవి. ఇందుకు సంబంధించిన ‘ఇ–పంచాయత్’ వెబ్సైట్లో మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఇందుకోసం రెండు ఆప్షన్లు అందుబాటులో ఉండేవి. అందులో మొదటిది విరాసత్, రెండోది కోర్టు డిక్రీ. ఇందులో ఇంటి యజమానులు తమ ఆస్తులను విరాసత్ దరఖాస్తు ద్వారా వారసులకు ఇచ్చేవారు. రెండు కొనుగోలు చేసుకున్న వారు కోర్టు డిక్రీ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఈ దరఖాస్తులను గ్రామ పంచాయతీ సెక్రటరీ విచారణ జరిపిన తర్వాత ఆస్తి మ్యుటేట్ అయ్యేది. గతంలో ఎడిట్ ఆప్షన్ ఉండేది. దీంతో ఏమైనా తప్పులు ఉన్నా దాన్ని అక్కడే పరిష్కరించుకునేవారు. ఇది చాలా వేగవంతమైన ప్రక్రియ తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యేది. ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి టీఎస్, బీపాస్ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. గ్రాపపంచాయతీ ఆస్తుల రిజిస్ట్రేషన్లు అన్నీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. దీంతో ‘ఇ–పంచాయత్’ వెబ్సైట్లో విరాసత్, కోర్టు డిక్రీ ఆప్షన్లు మాయమయ్యాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు బదిలీ కాక అలాగే మిగిలిపోతున్నాయి. సమస్య ఏంటి? నాలుగు జిల్లాల్లోని గ్రామాల్లో వేలాది ఇండ్లకు సరైన ధ్రువపత్రాలు లేవు. దశాబ్దాల తరబడి వారసత్వంగా ఇండ్లు చేతులు మారుతున్నాయి. వాటికి ఇంటి నెంబర్లు ఉంటాయి. ఏటా ఇంటి పన్నులు కడుతారు. కానీ.. ఆ ఇల్లు కొన్నట్లు, కట్టినట్లు ఎలాంటి పత్రాలు లేవు. వాస్తవానికి గ్రామపంచాయతీల ఆవిర్భవానికి ముందు నుంచే ఆ ఇళ్లు మనుగడలో ఉన్నాయి. ఇలాంటి ఇళ్ల పరిస్థితుల్లో ప్రధానమైన చిక్కులు తలెత్తుతున్నాయి. అడ్డంకులివే.. ► ఇంటి యజమానులు లేకుంటే ఆ ఇళ్లు వారసుల పేరిట బదిలీ కావడం లేదు. యజమాని బతికుంటే విరాసత్ సజావుగా సాగుతున్నాయి. ► ఇంటి నెంబరు, ఇంటి పన్నులు కట్టిన కాగితాలు తప్ప ఇంటికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేని ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ► ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లు.. అంతకుముందు సరైన డాక్యుమెంట్లు లేని ఇండ్లను చాలామందే కొనుగోలు చేశారు. వీటిలో చాలామటుకు మ్యుటేషన్ కాలేదు. టీఎస్ బీపాస్‌తో ఆస్తులు మ్యుటేషన్ కాకపోవడంతో ఆఫీసర్లు పక్కన పెడుతున్నారు. ► గతంలో రేకుల ఇల్లు/ పెంకుటిల్లును కూల్చి, గ్రామంలో కొత్తగా జీ 2 నిర్మించుకున్నా సరే ఆన్లైన్లో ఇంకా పాత రేకుల ఇల్లు/ పెంకుటిల్లుగానే చూపెడుతోంది. ‘ఎడిట్’ ఆప్షన్ లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న యజమానులు, పన్నులు రాక పంచాయతీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇబ్బందులివీ.. ► కుటుంబ అవసరాలకు ఇంటిని విక్రయించాలనుకుంటున్న వారికి పేరుమార్పిడి నిబంధన ఇబ్బందికరంగా మారింది. ► పెళ్లీళ్లు, అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ► ఆస్తులు అమ్మాలనుకుంటున్న వారు పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, వార్డు మెంబర్ల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ► వృద్ధులు, నిరక్షరాస్యులు ఏంతెలియక సతమతమవుతున్నారు. ఇంకొన్నిచోట్ల ఇదే అదనుగా కొందరు ఇదిచేస్తాం.. అదిచేస్తామంటూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ► గతంలో ఇంటిని కొన్నాక.. ఇప్పుడు మ్యుటేషన్ కాకపోవడంతో కొనుగోలుదారుడు, విక్రయదా రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పేరు మారని ఆస్తులు మాకేందుకంటూ నిలదీస్తున్నారు. -
అంతరాలను పెంచుతున్న ఆస్తులు
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తికి ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కొడుకులు. ఆయన ఆరేళ్లక్రితం చనిపోయారు. బతికి ఉండగా సంపాదించిన ఏడు గుంటల స్థలం ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వత అగాధాన్ని పెంచింది. పాతికేళ్లక్రితం పెళ్లై, కట్నం కింద కొంతనగదు, ఇంటి స్థలాన్ని కూడా పొందిన ఆమె తల్లిదండ్రుల మరణానంతరం వాళ్ల ఆస్తిలో వాటాకావాలంటూ కోర్టు మెట్లెక్కింది. ఆస్తి పాస్తులు అయిన వాళ్ల మధ్య అంతరాలను పెంచుతున్నాయి. రక్త సంబంధాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉందని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు నేపథ్యంలో ఇపుడు కోర్టు మెట్లు ఎక్కుతున్నవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినవాళ్ల మధ్య అగాధాలు ఆస్తి పంపకాల సమయంలో వాటాలు కావాలని వివాదాలకు దిగుతున్న ఆడపిల్లల విషయంలో.. బంధుత్వాలు భారంగా మారుతున్నాయి. కొద్దిపాటి ఆస్తిలో కూడా వాటా కావాలని భీష్మించుకున్న సందర్భాల్లో విధి లేక వాటా అంటూ ఇస్తే ఇకపై రాకపోకలు బంద్ అని, ఏ రకమైన శుభకార్యాలకు ఆహ్వానాలు ఉండవు పరస్పరం హెచ్చరించుకుంటున్నారు. ఒçకే రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వతమైన అగాధానికి ఈ ఆస్తి వివాదాలు కారణమవుతున్నాయి. తండ్రి మరణించినా సరే... సవరణ తేదీ నాటికీ కూతురు తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది. తాజా తీర్పు ప్రకారం సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకున్నా... ఆమె సంతానం ఆమెకు రావాల్సిన వాటాను కోరవచ్చు. దీంతో ఈ తీర్పు హిందూ అవిభాజ్య కుటుంబంలో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. 1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9న పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి స్వార్జిత ఆస్తిలో ఆడ పిల్లలకు సమాన వాటా ఉంటుందని ఆ చట్టం చెబుతోంది. చట్టం కావాలంటోంది.. సంప్రదాయం వద్దంటోంది ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలోనే తండ్రి తనకున్న దాంట్లో ఘనంగా వివాహం చేస్తూ కట్న కానుకలను సమర్పించుకుంటాడు. ఇంట్లో జరిగే ప్రతీ శుభకార్యాల సమయంలో కూడా కూతురుకు కట్నాల పేరుతో కొంత సమర్పిస్తారు. ఆస్తిలో వాటా అడగరు అనే అభిప్రాయంతోనే ఇవన్నీ చేస్తారు. ఆస్తుల విభజన సమయంలో ఆడపిల్లల కంటినీళ్లు శుభం కాదనే సెంటిమెంట్‌తో శక్తి మేరకు నగదునో, బంగారాన్నో కానుకగా ఇచ్చి అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటూ ఉండడం ఇప్పటివరకు వస్తున్న సామాజిక సంప్రదాయం. ఆస్తి హక్కులో ఆడపిల్లలకు వాటా అన్న నియమం వచ్చింతర్వాత కట్న కానుకలు తీసుకున్న వాళ్లు కూడా ఆస్తిలో వాటా సమయానికి వివాదాలకు తెరలేపడం, చట్టాన్ని కారణంగా చూపడం ప్రస్తుత వివాదాలకు కారణమవుతోంది. సుప్రీం ఏం చెప్పిందంటే.. కొడుకులతోపాటు కూతుర్లకు సమాన ఆస్తి హక్కు ఉంటుంది. హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కుపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రక తీర్పునిచ్చింది. తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ వారసత్వ హక్కు దాఖలు అవుతుందని 2005 సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును సవరించింది. 2005 కన్నా ముందే తండ్రి లేదా తల్లి మరణించినా వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంపై అవగాహన పెంచుకోవాలి ఆస్తి హక్కుపై న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నది నిజమే. అవగాహన లేని కారణంగానే దగ్గర వాళ్లు కూడా చూసుకోలేనంతగా దూరం అవుతున్నారు. సమాన హక్కు అనే చట్టంపై విస్తృతంగా అవగాహన పెంచుకుంటే అంతరాలు తగ్గుతాయి. ఆడపిల్లకు పెళ్లి సమయంలోనే ఇవ్వదల్చుకున్న ఆస్తిపై స్పష్టత, రాతపూర్వక ఒప్పందాలు చేసుకుంటే అనంతర కాలంలో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ఉంటుంది. – ఆవునూరి రమాకాంత్‌రావు, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల బాధ్యతల్లోనూ సమానమని గుర్తించాలి వారసత్వపు ఆస్తిలో మాత్రమే ఆడపిల్లలకు హక్కు ఉంటుంది. హక్కుల గురించి మాట్లాడే సమయంలో బాధ్యతలు నిర్వహించాలనే కనీస జ్ఞానం కూడా ఉంటే సమాజానికి క్షేమం. రక్త సంబంధీకులు ఆర్థికంగా చితికిపోతే ఆదుకున్న ఆడపిల్లల సంఖ్య అరుదు అనే చెప్పాలి. కొడుకులతోపాటు కూతుర్లు సమానమే..కాదనం.. అది పంపకాల్లో మాత్రమే కాదు బా«ధ్యతల్లో కూడా ఉంటే ఇలాంటి కేసుల ప్రస్తావనే ఉండదని నా అభిప్రాయం. – చెక్కిళ్ల మహేశ్‌గౌడ్, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల -
ఎంఐఎం ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : యాకుత్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సమయంలో ముంతాజ్ ఖాన్ పూర్తి ఆస్తుల వివరాలు వెల్లడించలేదని రూప్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఆధారాలతో పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. దీనిని విచారించిన హైకోర్టు ఈ నెల 18 వరకు ఆస్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ఎమ్మెల్యేకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. -
జయ నిర్దోషిత్వంపై స్టే ఇవ్వండి
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో కర్ణాటక అప్పీలు న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఇటీవల నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జయతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇలవరసి తదితరులను నిర్దోషులుగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. కర్ణాటక ప్రభుత్వం తరఫున జోసెఫ్ అరిస్టాటిల్ అనే న్యాయవాది అప్పీలు దాఖలు చేశారు. జయ ఆదాయానికి మించిన ఆస్తుల విలువను అంచనావేయడంలో, లెక్కించడంలో హైకోర్టు పొరపాటుగా వ్యవహరించిందని పేర్కొన్నారు. వాస్తవంగా ఆమె రుణాల విలువను రూ.10.67 కోట్లుగా లెక్కించాల్సి ఉండగా, రూ.24 కోట్లుగా లెక్కించారని చెప్పారు. దీంతో ఆదాయానికి మించి ఉన్న ఆస్తులశాతం చాలా తక్కువగా 8.12 శాతంగా మాత్రమే తేలిందని.. కానీ ఈ అదనపు ఆస్తుల విలువ 76.7 శాతం కంటే ఎక్కువేనని పిటిషన్లో పేర్కొన్నారు. అంటే ఆమె ఆదాయానికి అనుగుణంగా ఉండాల్సిన ఆస్తి రూ.21.26 కోట్లు కాగా, అంతకు మించి రూ.16.32కోట్లు అదనంగా ఉన్నట్లు లెక్కతేలుతుందని వివరించారు. అంతేగాకుండా కర్ణాటకను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఈ కేసు విచారణ సమయంలో జయ తమిళనాడు సీఎంగా ఉండడంతో దర్యాప్తుపై ప్రభావం పడిందన్నారు. అందువల్ల జయ తదితరులను నిర్దోషులుగా విడుదలచేస్తూ కర్టాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాల్సిందిగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు. అప్పీలుపై తమిళనాడులోని డీఎంకే తదితర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. -
ముందస్తుకే జయ మొగ్గు!
17న సీఎంగా ప్రమాణ స్వీకారం 14న శాసనసభా పక్ష నేతగా ఎన్నిక అనంతరం గవర్నర్‌కు తీర్మానం అందజేత చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి విముక్తి పొందిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముందస్తు ఎన్నికలకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. జయ సీఎం అయిన ఆరు నెలల్లోగా ఏదో ఒక నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. జయ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆర్నెల్ల తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచి, మరో ఆరు నెలలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవడం అనవసరమని జయలలిత భావించవచ్చు. ఈ నెలలోనే పదవిని చేపట్టి, ఐదు నెలలపాటు సీఎంగా వ్యవహరించి ఆ తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. వాస్తవంగా అన్నాడీఎంకే ప్రభుత్వానికి 2016, మే నాటికి ఐదేళ్లు పూర్తవుతుండగా, ఈఏడాది చివర్లో ఎన్నికలు తథ్యమని అంటున్నారు. 14న సీఎం రాజీనామా ఈనెల 14న ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రివర్గం సమావేశమై రాజీనామాలు చేసి గవర్నర్‌కు సమర్పిస్తారని భావిస్తున్నారు. అదేరోజు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభాపక్ష నేతగా జయను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ తీర్మానాన్ని గవర్నర్ కె.రోశయ్యకు అందజేస్తారు. ఆ వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా జయను గవర్నర్ ఆహ్వానిస్తారు. తమిళనాడు ప్రజలు శుభదినంగా భావించే నిండు అమావాస్య రోజైన ఈనెల 17న జయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అనధికార సమాచారం. కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ వెలువరించిన తీర్పు ప్రతులను తమిళనాడు ఏసీబీ ఐజీ గుణశీలన్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. దీంతో ఎమ్మెల్యే, సీఎం పదవులకు అనర్హురాలిగా జయపై ఉన్న నిషేధం ఎత్తివేసినట్లయింది. అప్పీలుకు వెళ్తే..? మరోవైపు హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాల్సిందేనని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. జయ సీఎం పీఠం ఎక్కినట్లయితే మళ్లీ రాజీనామా చేయకతప్పదని సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. అయితే ఆయన్ను బీజేపీ అగ్రనేతలు కట్టడి చేయవచ్చని అంటున్నారు. ఇలాంటి డోలాయమాన స్థితిలో తొందరపడరాదని జయ భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం అప్పీలుకు వె ళ్తే సుప్రీంకోర్టులో సైతం కేసు నుంచి బయటపడి, ఎన్నికల్లో గెలుపొంది ఒకేసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తే బాగుంటుందని కూడా జయలలిత యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘జయ మళ్లీ రాజీనామా చేయాల్సి వస్తుంది!’ చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సిద్ధమవుతున్నారు. ‘‘ఈ కేసులో కర్టాటక హైకోర్టు ‘లెక్కలు’ తప్పని నేను సుప్రీంకోర్టులో నిరూపిస్తా. జయలలిత ఒకవేళ సీఎంగా పగ్గాలు చేపడితే మళ్లీ రాజీనామా చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన మంగళవారం ట్విటర్లో వ్యాఖ్యానించారు. జయపై ఈ కేసును 1996లో సుబ్రహ్మణ్య స్వామే దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
వైఎస్ జగన్ బెయిల్ అడ్డుకోడానికి టీడీపీ యత్నాలు
కేసులో విచారణ వేగం పెంచాలంటూ సీవీసీ, ఈడీ, సీబీఐకి టీడీపీ ఎంపీల వినతి సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్తుల కేసులో విచారణను వేగవంతం చేయాలని టీడీపీ ఎంపీల బృందం సీవీసీ, ఈడీ, సీబీఐకి విజ్ఞప్తి చేసింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు కె.నారాయణరావు, సీఎం రమేష్, గుండు సుధారాణి, రమేష్ రాథోడ్‌తో కూడిన బృందం మంగళవారం ఉదయం సెంట్రల్ విజిలెన్సు కమిషనర్, మధ్యాహ్నం ఈడీ డెరైక్టర్, సాయంత్రం సీబీఐ డెరైక్టర్ కార్యాలయాలకు వెళ్లి ఈ మేరకు వినతి పత్రాలు అందచేసింది. అనంతరం నామా ఏపీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాము సీవీసీ ప్రదీప్‌కుమార్, ఈడీ డెరైక్టర్ రాజన్ కటోచ్, సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాని స్వయంగా కలిసి కేసు విచారణలో జరుగుతున్న జాప్యాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ వరుసగా చార్జిషీట్లు దాఖలు చేస్తున్న సమయంలో దర్యాప్తు నీరుగారుతోందన్న సాకుతో టీడీపీ ఎంపీలు దర్యాప్తు సంస్థల అధిపతులతో పాటు సీవీసీని సైతం కలవడం గమనార్హం. వాస్తవానికి జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సెప్టెంబర్ 9 నాటికి దర్యాప్తు పూర్తి చేసి, తుది చార్జిషీటు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు నాలుగు నెలల కిందట సీబీఐని ఆదేశించింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. సీబీఐ ఇంకా చార్జిషీట్లు వేస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా బెయిల్ కోసం జగన్మోహన్రెడ్డి కిందికోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కనబెడుతూ.. ఈ కేసులో జాప్యం జరుగుతోందంటూ సీబీఐ, ఈడీ, సీవీసీలను కలవడం గమనార్హం. గతంలో కూడా జగన్ కేసులో కీలక వాదనలు జరిగే ప్రతి సమయంలోనూ చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండడం, ఆయన, ఆయన పార్టీ ఎంపీలు ఏదో ఒక పేరుతో కాంగ్రెస్ పెద్దలను కలవడం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో మరుసటి రోజు జగన్ బెయిల్‌పై తీర్పు ఉందనగా.. టీడీపీ ఎంపీలు వెళ్లి చిదంబరాన్ని కలవడం, కలసిన రెండు గంటల్లోనే ‘సాక్షి’ ఆస్తుల జప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. అలాగే ఢిల్లీలో చంద్రబాబు ఒక్కరే రహస్యంగా వెళ్లి చీకట్లో చిదంబరాన్ని కలిసిన సంగతి విదితమే. ఈ విషయాన్ని చిదంబరమే పార్లమెంటులో చెప్పారు.