జయ నిర్దోషిత్వంపై స్టే ఇవ్వండి
హైకోర్టు తీర్పుపై సుప్రీంలో కర్ణాటక అప్పీలు
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఇటీవల నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జయతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇలవరసి తదితరులను నిర్దోషులుగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. కర్ణాటక ప్రభుత్వం తరఫున జోసెఫ్ అరిస్టాటిల్ అనే న్యాయవాది అప్పీలు దాఖలు చేశారు. జయ ఆదాయానికి మించిన ఆస్తుల విలువను అంచనావేయడంలో, లెక్కించడంలో హైకోర్టు పొరపాటుగా వ్యవహరించిందని పేర్కొన్నారు. వాస్తవంగా ఆమె రుణాల విలువను రూ.10.67 కోట్లుగా లెక్కించాల్సి ఉండగా, రూ.24 కోట్లుగా లెక్కించారని చెప్పారు.
దీంతో ఆదాయానికి మించి ఉన్న ఆస్తులశాతం చాలా తక్కువగా 8.12 శాతంగా మాత్రమే తేలిందని.. కానీ ఈ అదనపు ఆస్తుల విలువ 76.7 శాతం కంటే ఎక్కువేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంటే ఆమె ఆదాయానికి అనుగుణంగా ఉండాల్సిన ఆస్తి రూ.21.26 కోట్లు కాగా, అంతకు మించి రూ.16.32కోట్లు అదనంగా ఉన్నట్లు లెక్కతేలుతుందని వివరించారు. అంతేగాకుండా కర్ణాటకను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఈ కేసు విచారణ సమయంలో జయ తమిళనాడు సీఎంగా ఉండడంతో దర్యాప్తుపై ప్రభావం పడిందన్నారు. అందువల్ల జయ తదితరులను నిర్దోషులుగా విడుదలచేస్తూ కర్టాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాల్సిందిగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు. అప్పీలుపై తమిళనాడులోని డీఎంకే తదితర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి.