![newly appointed three additional judges swearing ceremony in ap high court andhra pradesh](/styles/webp/s3/article_images/2024/10/29/AP-LLL.jpg.webp?itok=uFwTHKPr)
హైకోర్టు న్యాయమూర్తులుగా.. మహేశ్వరరావు, చంద్ర ధనశేఖర్, గుణరంజన్ ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూటా చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లు సోమవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఈ ముగ్గురితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అంతకుముందు.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు ఈ ముగ్గురు నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను చదవి వినిపించారు. అనంతరం సీజే వారితో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సీజే ఒక్కొక్కరికీ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను అందచేశారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ మంతోజు గంగారావు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్రమాణం అనంతరం జస్టిస్ ధనశేఖర్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ గుహనాథన్ నరేందర్‌తో కలిసి కేసులను విచారించారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ గుణరంజన్‌లు సింగిల్ జడ్జీలుగా కేసులను విచారించారు. ప్రమాణం సందర్భంగా న్యాయవాదులు, శ్రేయోభిలాషులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురితో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. మరో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను న్యాయాధికారులు, న్యాయవాదులతో భర్తీచేసేందుకు జనవరిలో చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment