కేసులో విచారణ వేగం పెంచాలంటూ సీవీసీ, ఈడీ, సీబీఐకి టీడీపీ ఎంపీల వినతి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో విచారణను వేగవంతం చేయాలని టీడీపీ ఎంపీల బృందం సీవీసీ, ఈడీ, సీబీఐకి విజ్ఞప్తి చేసింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు కె.నారాయణరావు, సీఎం రమేష్, గుండు సుధారాణి, రమేష్ రాథోడ్‌తో కూడిన బృందం మంగళవారం ఉదయం సెంట్రల్ విజిలెన్సు కమిషనర్, మధ్యాహ్నం ఈడీ డెరైక్టర్, సాయంత్రం సీబీఐ డెరైక్టర్ కార్యాలయాలకు వెళ్లి ఈ మేరకు వినతి పత్రాలు అందచేసింది. అనంతరం నామా ఏపీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాము సీవీసీ ప్రదీప్‌కుమార్, ఈడీ డెరైక్టర్ రాజన్ కటోచ్, సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాని స్వయంగా కలిసి కేసు విచారణలో జరుగుతున్న జాప్యాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ వరుసగా చార్జిషీట్లు దాఖలు చేస్తున్న సమయంలో దర్యాప్తు నీరుగారుతోందన్న సాకుతో టీడీపీ ఎంపీలు దర్యాప్తు సంస్థల అధిపతులతో పాటు సీవీసీని సైతం కలవడం గమనార్హం. వాస్తవానికి జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సెప్టెంబర్ 9 నాటికి దర్యాప్తు పూర్తి చేసి, తుది చార్జిషీటు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు నాలుగు నెలల కిందట సీబీఐని ఆదేశించింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. సీబీఐ ఇంకా చార్జిషీట్లు వేస్తోంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా బెయిల్ కోసం జగన్‌మోహన్‌రెడ్డి కిందికోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కనబెడుతూ.. ఈ కేసులో జాప్యం జరుగుతోందంటూ సీబీఐ, ఈడీ, సీవీసీలను కలవడం గమనార్హం. గతంలో కూడా జగన్ కేసులో కీలక వాదనలు జరిగే ప్రతి సమయంలోనూ చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండడం, ఆయన, ఆయన పార్టీ ఎంపీలు ఏదో ఒక పేరుతో కాంగ్రెస్ పెద్దలను కలవడం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో మరుసటి రోజు జగన్ బెయిల్‌పై తీర్పు ఉందనగా.. టీడీపీ ఎంపీలు వెళ్లి చిదంబరాన్ని కలవడం, కలసిన రెండు గంటల్లోనే ‘సాక్షి’ ఆస్తుల జప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. అలాగే ఢిల్లీలో చంద్రబాబు ఒక్కరే రహస్యంగా వెళ్లి చీకట్లో చిదంబరాన్ని కలిసిన సంగతి విదితమే. ఈ విషయాన్ని చిదంబరమే పార్లమెంటులో చెప్పారు.
వైఎస్ జగన్ బెయిల్ అడ్డుకోడానికి టీడీపీ యత్నాలు
Published Wed, Sep 18 2013 3:16 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement