సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తికి ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కొడుకులు. ఆయన ఆరేళ్లక్రితం చనిపోయారు. బతికి ఉండగా సంపాదించిన ఏడు గుంటల స్థలం ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వత అగాధాన్ని పెంచింది. పాతికేళ్లక్రితం పెళ్లై, కట్నం కింద కొంతనగదు, ఇంటి స్థలాన్ని కూడా పొందిన ఆమె తల్లిదండ్రుల మరణానంతరం వాళ్ల ఆస్తిలో వాటాకావాలంటూ కోర్టు మెట్లెక్కింది. ఆస్తి పాస్తులు అయిన వాళ్ల మధ్య అంతరాలను పెంచుతున్నాయి. రక్త సంబంధాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉందని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు నేపథ్యంలో ఇపుడు కోర్టు మెట్లు ఎక్కుతున్నవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
అయినవాళ్ల మధ్య అగాధాలు
ఆస్తి పంపకాల సమయంలో వాటాలు కావాలని వివాదాలకు దిగుతున్న ఆడపిల్లల విషయంలో.. బంధుత్వాలు భారంగా మారుతున్నాయి. కొద్దిపాటి ఆస్తిలో కూడా వాటా కావాలని భీష్మించుకున్న సందర్భాల్లో విధి లేక వాటా అంటూ ఇస్తే ఇకపై రాకపోకలు బంద్ అని, ఏ రకమైన శుభకార్యాలకు ఆహ్వానాలు ఉండవు పరస్పరం హెచ్చరించుకుంటున్నారు. ఒçకే రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వతమైన అగాధానికి ఈ ఆస్తి వివాదాలు కారణమవుతున్నాయి.
తండ్రి మరణించినా సరే...
సవరణ తేదీ నాటికీ కూతురు తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది. తాజా తీర్పు ప్రకారం సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకున్నా... ఆమె సంతానం ఆమెకు రావాల్సిన వాటాను కోరవచ్చు. దీంతో ఈ తీర్పు హిందూ అవిభాజ్య కుటుంబంలో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. 1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9న పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి స్వార్జిత ఆస్తిలో ఆడ పిల్లలకు సమాన వాటా ఉంటుందని ఆ చట్టం చెబుతోంది.
చట్టం కావాలంటోంది.. సంప్రదాయం వద్దంటోంది
ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలోనే తండ్రి తనకున్న దాంట్లో ఘనంగా వివాహం చేస్తూ కట్న కానుకలను సమర్పించుకుంటాడు. ఇంట్లో జరిగే ప్రతీ శుభకార్యాల సమయంలో కూడా కూతురుకు కట్నాల పేరుతో కొంత సమర్పిస్తారు. ఆస్తిలో వాటా అడగరు అనే అభిప్రాయంతోనే ఇవన్నీ చేస్తారు. ఆస్తుల విభజన సమయంలో ఆడపిల్లల కంటినీళ్లు శుభం కాదనే సెంటిమెంట్‌తో శక్తి మేరకు నగదునో, బంగారాన్నో కానుకగా ఇచ్చి అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటూ ఉండడం ఇప్పటివరకు వస్తున్న సామాజిక సంప్రదాయం. ఆస్తి హక్కులో ఆడపిల్లలకు వాటా అన్న నియమం వచ్చింతర్వాత కట్న కానుకలు తీసుకున్న వాళ్లు కూడా ఆస్తిలో వాటా సమయానికి వివాదాలకు తెరలేపడం, చట్టాన్ని కారణంగా చూపడం ప్రస్తుత వివాదాలకు కారణమవుతోంది.
సుప్రీం ఏం చెప్పిందంటే..
కొడుకులతోపాటు కూతుర్లకు సమాన ఆస్తి హక్కు ఉంటుంది. హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కుపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రక తీర్పునిచ్చింది. తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ వారసత్వ హక్కు దాఖలు అవుతుందని 2005 సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును సవరించింది. 2005 కన్నా ముందే తండ్రి లేదా తల్లి మరణించినా వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
చట్టంపై అవగాహన పెంచుకోవాలి
ఆస్తి హక్కుపై న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నది నిజమే. అవగాహన లేని కారణంగానే దగ్గర వాళ్లు కూడా చూసుకోలేనంతగా దూరం అవుతున్నారు. సమాన హక్కు అనే చట్టంపై విస్తృతంగా అవగాహన పెంచుకుంటే అంతరాలు తగ్గుతాయి. ఆడపిల్లకు పెళ్లి సమయంలోనే ఇవ్వదల్చుకున్న ఆస్తిపై స్పష్టత, రాతపూర్వక ఒప్పందాలు చేసుకుంటే అనంతర కాలంలో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ఉంటుంది. – ఆవునూరి రమాకాంత్‌రావు, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల
బాధ్యతల్లోనూ సమానమని గుర్తించాలి
వారసత్వపు ఆస్తిలో మాత్రమే ఆడపిల్లలకు హక్కు ఉంటుంది. హక్కుల గురించి మాట్లాడే సమయంలో బాధ్యతలు నిర్వహించాలనే కనీస జ్ఞానం కూడా ఉంటే సమాజానికి క్షేమం. రక్త సంబంధీకులు ఆర్థికంగా చితికిపోతే ఆదుకున్న ఆడపిల్లల సంఖ్య అరుదు అనే చెప్పాలి. కొడుకులతోపాటు కూతుర్లు సమానమే..కాదనం.. అది పంపకాల్లో మాత్రమే కాదు బా«ధ్యతల్లో కూడా ఉంటే ఇలాంటి కేసుల ప్రస్తావనే ఉండదని నా అభిప్రాయం. – చెక్కిళ్ల మహేశ్‌గౌడ్, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment