హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి చట్టవిరుద్ధమైనప్పటికీ రెండవ భార్య భరణానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
న్యూఢిల్లీ: హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి చట్టవిరుద్ధమైనప్పటికీ రెండవ భార్య భరణానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. జస్టిస్ రంజనా ప్రకాశ్, జస్టిస్ సిక్రీలతో కూడిన ధర్మాసనం ఒక కేసును విచారిస్తూ ఈ తీర్పునిచ్చింది. రెండవ భార్యకు భరణం ఇవ్వాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే మొదటి వివాహాన్ని దాచి రెండవసారి పెళ్లి చేసుకుంటే రెండవ భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఆ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రెండవ భార్య భరణానికి అర్హురాలు కాదని గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూలింగ్‌కు సవరణ చేయకపోతే భర్తలు ఇలా రెండవ పెళ్లి చేసుకొని రెండవ భార్యలను గాలికి వదిలేస్తారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మొదటి వివాహాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి రెండవ పెళ్లి చేసుకుంటే ఆ రెండవ భార్యకు చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుందని, ఆమె భరణం పొందడానికి అర్హురాలేనని ధర్మాసనం తెలిపింది. మొదటి వివాహం జరిగి భార్య జీవించి ఉన్నట్టు తమకు తెలిసీ పెళ్లి చేసుకునే మహిళలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేశారు.