10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం! | Supreme Court Top 10 Verdict Of The Year 2023 | Sakshi
Sakshi News home page

Supreme Court top Ten Verdict: 10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం!

Published Tue, Dec 19 2023 11:03 AM | Last Updated on Tue, Dec 19 2023 11:31 AM

Supreme Court top Ten Verdict of The Year 2023 - Sakshi

ఏ దేశంలోనైనా వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. భారత అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాల ద్వారా పలు వివాదాలకు పరిష్కారం చూపింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పొడవునా సుప్రీంకోర్టు అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. వాటిలో 10 తీర్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఆర్టికల్‌ 370 రద్దు
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు ఈ ఏడాది కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది.

2. విడాకుల విషయంలో..
విడాకులపై ఈ ఏడాది సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది. ఇక విడాకులు ఇచ్చేందుకు న్యాయస్థానాలు ఆరు నెలలు వేచిచూడనక్కరలేదని పేర్కొంది.  విడాకులకు దంపతులు ఆసక్తి చూపిన వెంటనే జారీ చేయవచ్చని పేర్కొంది. విడాకుల మంజూరు కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

3. ద్వేషపూరిత ప్రసంగాలు..
ద్వేషపూరిత ప్రసంగం అనేది దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ద్వేషపూరిత ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ కేసులు నమోదు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 2022లో కేవలం మూడు రాష్ట్రాలకు వర్తించే తీర్పు పరిధిని విస్తరించింది. 

4. డీమోనిటైజేషన్ నిర్ణయంపై..
మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై 2023లో తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

5. ఎన్నికల కమిషనర్ల నియామకం
ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్‌లను ప్యానెల్‌ ద్వారా నియమిస్తామని కోర్టు తెలిపింది. ఈ ప్యానెల్‌లో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. ఈ ముగ్గురు కలిసి తదుపరి ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని నిర్ణయిస్తారని కోర్టు పేర్కొంది.

6. స్వలింగ జంటల వివాహం
2023లో సుప్రీంకోర్టు స్వలింగ జంటల వివాహానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించడాన్ని కోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

7. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 153ఏ (ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 153ఏ) కింద సోదాలు జరిపినప్పుడు నిర్దిష్టమైన ఆధారాలు లభించకపోతే పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని ఏకపక్షంగా పెంచలేరని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశంతో ఇలాంటి సందర్భాల్లో ఆదాయ పన్ను విభాగం ఇష్టారాజ్యం ఇకపై తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.  

8. జల్లికట్టుపై కీలక నిర్ణయం
తమిళనాడు, మహారాష్ట్రల సంప్రదాయ క్రీడలైన జల్లికట్టు, ఎడ్ల బళ్ల పందేలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రలో ఎద్దుల బండి పందేలను అనుమతించే చట్టం చెల్లుబాటుపై కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ఆటలు శతాబ్దాలుగా సంస్కృతిలో భాగమని, వాటికి అటంకం కలిగించలేమని కోర్టు పేర్కొంది.

9. అవినీతి అధికారులపై కఠిన చర్యలు
అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది తన నిర్ణయాన్ని వెలువరించింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2014కు ముందు నమోదైన అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించబోమని కోర్టు స్పష్టం చేసింది.

10. అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో..
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు ఈ ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు మార్చి 2న ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ రిసోర్స్ రిపోర్ట్ లేవనెత్తిన ప్రశ్నలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని ఈ కమిటీలో ఆరుగురు సభ్యులను చేర్చాలని కోరింది.
ఇది కూడా చదవండి:  గోవా విముక్తికి భారత్‌ ఏం చేసింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement