hindu Marriage act
-
హిందూ వివాహ చట్టప్రకారం ఎస్టీలు విడాకులు ఇవ్వొచ్చు
సాక్షి, హైదరాబాద్: హిందూ వివాహ చట్టప్రకారం వివాహం చేసుకున్న ఎస్టీలకు అదే చట్టప్రకారం విడాకులు ఇవ్వవచ్చని.. అయితే పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన ఓ గిరిజన (లంబాడ) దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కామారెడ్డి సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఎస్టీకి చెందిన వారికి హిందూ వివాహ చట్టం సెక్షన్ 2(2) వర్తించదని కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిపై దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సృజన్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు పూర్తిగా హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారని.. పెళ్లి కార్డు సహా ఇతర ఆధారాలన్నీ పరిశీలించాల్సిన ట్రయల్ కోర్టు ఆ పని చేయలేదన్నారు. హిందూ లంబాడా వర్గానికి చెందిన వారని.. హిందూ వివాహ చట్టం వారికి వర్తించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు లంబాడా వర్గానికి చెందిన వారైనా వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున ట్రయల్ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి ఆ మేరకు విడాకులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 2(2).. ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న ఎస్సీలకు వర్తించదని, ఈ కేసుకు మాత్రమే పరిమితమని చెప్పారు. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తున్నామన్నారు. -
విడాకులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: వివాహాల రద్దుపై సుప్రీం కోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. కలిసి బతకలేని స్థితిలో ఆ జంట విడాకుల కోసం ఆర్నెళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తమకు విశిష్ట అధికారాలు ఉన్నాయని గుర్తు చేసింది సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. విడాకులు కోరే జంట నడుమ కోలుకోలేని విభేధాలు, సమస్యలు పరిష్కారం కానీ స్థితి తలెత్తినప్పుడు.. కలిసి జీవించలేని స్థితి నెలకొంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ వివాహాన్ని వెంటనే రద్దు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142(విశిష్ట అధికారం) కింద తమకు ఉంటుందని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు విధించే ఆర్నెళ్ల గడువు ప్రస్తావనే ఉండబోదని స్పష్టం చేసింది. తద్వారా ఫాస్ట్ ట్రాక్ విడాకులకు తెర తీసింది సర్వోన్నత న్యాయస్థానం. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(B).. ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకులు కోరవచ్చు. కుటుంబ న్యాయస్థానాల్లో విడాకుల కోసం సుదీర్ఘంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే.. ఆర్టికల్ 142ను ఉపయోగించి.. తన తాజా ఆదేశాల్లో ఆ అంశాల్ని పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. ఫ్యామిలీ కోర్టులకు వెళ్లమని సూచించడానికి బదులుగా.. వెంటనే విడాకులను మంజూరు చేయొచ్చని అభిప్రాయపడింది. ‘‘ఆర్థికల్ 142 అనేది ప్రాథమిక హక్కులకు వెలుగు రేఖ లాంటిదని సుప్రీం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. తద్వారా పూర్తిస్థాయి న్యాయం.. అదీ ఎలాంటి వాయిదాలు వేయకుండా ఈ కోర్టు(సుప్రీం కోర్టు తనను తాను ఉద్దేశించి..) అందిస్తుంద’’ని తెలిపింది. ఏడేళ్ల కిందటినాటి ఈ కేసు.. సుప్రీం కోర్టులో అప్పటి డివిజన్ బెంచ్ న్యాయమూర్తులైన జస్టిస్ కీర్తి సింగ్, జస్టిస్ ఆర్ భానుమతి(ఇద్దరూ రిటైర్ అయ్యారు) రాజ్యాంగ ధర్మాసనానికి బదలీ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం.. కిందటి ఏడాది సెప్టెంబర్ చివర్లోనే వాదనలు విని.. తీర్పును రిజర్వ్ చేసింది. చివరికి ఇవాళ (మే 1, 2023)న సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరిలు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో.. భరణం చెల్లింపు, పిల్లల హక్కులకు సంబంధించి ఈక్విటీలను ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా బెంచ్ వివరించింది.ఔ ఇదీ చదవండి: ఆ 14 మెసెంజర్ యాప్‌లపై కేంద్రం కొరడా -
స్వతంత్ర భారతి: హిందూ వివాహ చట్టం
హిందూ వివాహ చట్టం 1955కి రూపకల్పన జరిగింది. అయితే ఈ చట్టం స్త్రీల పట్ల వివక్ష చూపుతోందనే విమర్శలూ ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది కానీ కుటుంబం లోపల వివాహ వ్యవస్థలో స్త్రీపై పురుషుడి ఆధిక్యత కొనసాగుతూనే ఉందన్నది కొందరు స్త్రీవాదుల పరిశీలన. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని మనం పరిశీలించినప్పుడు వివక్ష అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అని మహిళా హక్కుల న్యాయవాదుల అభిప్రాయం. ‘‘వివాహ వ్యవస్థ లోపల మహిళల ప్రతిపత్తి పురుషులతో పోలిస్తే చాలా వ్యత్యాసంతో ఉంటుంది. పురుషుడు సంపాదనాపరుడు, అతడి సంపాదనను ఆర్థిక పదబంధాలతో కొలుస్తారు. మహిళ గృహిణి. అంతే కాకుండా వివాహ వ్యవస్థ లోపల ఆమె అధీనురాలి స్థితిలో ఉంటుంది. ఆమె కుటుంబం, సమాజానికి చెందిన సాంస్కృతిక నియమాలను నిలబెట్టే స్థానంలో ఉంటుంది. అయితే వివాహ చట్టాల్లోపల వధూవరుల మధ్య ఉంటున్న ఈ అసమానతా స్థితిని ఎవరూ గుర్తించరు. ఇక విడాకులకు ప్రయత్నిస్తున్నప్పుడు స్త్రీపురుషులిరువురూ తమ పిటిషన్లను ఒకే నిర్దిష్ట భూమికపై సమర్పించాల్సి ఉంటుంది. అవేమిటంటే– వ్యభిచారం, పారిపోవడం, క్రూరత్వం! ఇందులో ఔచిత్యం లేదనిపిస్తుంది’’ అనే కోణం కూడా వారి అభిప్రాయంలో కనిపిస్తుంది. ఏమైనా హిందూ వివాహ చట్టంలో కొన్ని మార్పులైతే తప్పనిసరిగా జరగవలసి ఉందని ఇటీవలి కొన్ని కేసులలో మహిళల తరఫున వాదించే న్యాయవాదులు స్పష్టం చేశారు. అడ్డుపడుతున్న సెక్షన్ : విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు 2018లో స్పష్టతనిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని ఆ కేసులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది. విడాకుల పిటిషన్ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15ను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. ఇరు వర్గాలు (భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో సెక్షన్ 15 వర్తించదని తెలిపింది. అంతేకాదు, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. తన భార్యతో విడాకులు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే పిటిషన్ దారుడు మరో వివాహం చేసుకున్నారు. తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తమకు విడాకులకు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. కానీ, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆ చట్టాలు నేటికీ వివక్షాపూరితమే!
హిందూ వివాహాలను 1955 నాటి హిందూ వివాహ చట్టం, ఒప్పంద వివాహంగా మార్చిందన్నది సత్యమే అయినప్పటికీ ఆ ఒప్పందంలో భార్యకు ఏ పాత్రా లేకపోవడం గమనార్హం. అందుకే వివాహ చట్టాలు నేటికీ స్త్రీలపట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయి. వివాహానంతరం ఎక్కడ నివాసముండాలి? ఇంటికి మరీ దూరంగా భార్య ఉద్యోగం చేయవచ్చా అనే అంశాలను భర్త మాత్రమే నిర్ణయిస్తుంటాడు. భర్తే కుటుంబ యజమాని (పతియే పరమేశ్వరుడు) కాబట్టి కోర్టులు కూడా భర్తకు అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి. భర్తకు విధేయంగా ఉండటం భార్య పవిత్ర విధి, అతడు ఎంపిక చేసిన స్థలంలోనే ఆమె నివసించాలి అనేదే ఇవాళ్టకీ నడుస్తోంది. మహిళా ఉద్యమం లేవనెత్తిన డిమాండ్ల కారణంగా మహిళలను కూడా చట్టం అనే పరిధిలోకి చేర్చినట్లు మనం గ్రహిస్తాము. నిజానికి, భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది కానీ కుటుంబం లోపల వివాహ వ్యవస్థలో స్త్రీపై పురుషుడి ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. పెళ్లయ్యాక తనకు నచ్చిన ఇంటిలో ఉండటం అనే స్త్రీల హక్కును ఇటీవలి వరకు ఎవరూ గుర్తించలేదు. మహిళకు ప్రాధాన్యం ఇచ్చే న్యాయ సిద్ధాంతం పక్షపాతంతో కూడుకున్నదనీ, అలాంటి న్యాయ మీమాంసకు తటస్థ దృక్పథం ఉండదని సూత్రీకరించవచ్చా? ఫెమినిస్టు కళ్లతో ప్రపంచాన్ని చూడటం లేదా మహిళల హక్కులు అనే భావనే పక్షపాతంతో ఉంటుందనీ ముద్ర వేయవచ్చా? శాసనానికి ఉండే సానుకూల లక్షణం కారణంగా, అది సమాజాన్ని సమర్థంగా మార్చివేసే ఉపకరణంగా పనిచేస్తుందని చెప్పడమంటే మరీ సాధారణీకరించినట్లు అవుతుందని పలువురు ఫెమినిస్టు సిద్ధాంతకారులు వాదిస్తున్నారు. వీరి దృష్టిలో శాసనం అనేది ఒక మొరటైన, పరిమిత స్వభావం కలిగిన పరికరం మాత్రమే. తనను రూపొందించిన సమాజంలోని ఆధిపత్య భావాలతో అది గిరి గీసుకుని ఉంటుందని వీరి అభిప్రాయం. శాసనం అభివృద్ధి క్రమాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, మహిళా ఉద్యమం లేవనెత్తిన డిమాండ్ల కారణంగా మహిళలను కూడా చట్టం అనే పరిధిలోకి చేర్చినట్లు మనం గ్రహిస్తాము. ప్రత్యేకించి మహిళలు పితృస్వామిక సమాజంలోని పౌరులుగా తమ హక్కులను ప్రకటించడం ప్రారంభమయ్యాక వారిని శాసన పరిధిలో చేర్చడం తప్పనిసరైంది. మహిళా ఉద్యమం డిమాండ్లు... సమానత్వం, ఓటు హక్కు, విద్యా హక్కు, అనేక వృత్తులను చేపట్టడం వంటివే కదా.. ఈ డిమాండ్లతోనే పాశ్చాత్య మహిళలు అనేక సమరాలు చేసి గెలుపొందారు. ఈ పోరాటాలతో ప్రభావితమై, భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది. స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో పాటు సమానత్వ భావన కూడా మన రాజ్యాంగంలో మహిళల పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలబడ్డాయి. ఓటు హక్కు, విద్య, ఉపాధిలో సమాన అవకాశాలు, సమాన పనికి సమాన వేతనం వంటివి సమానత్వం అనే భావన కిందికి వచ్చి చేరాయి. అయితే వివాహ చట్టాల కింద గృహవ్యవస్థను మనం పరిశీలించినప్పుడు, ఈ సమానత్వ భావన మహిళలకు హానికరంగా మారుతుంది. మన వివాహ వ్యవస్థలో స్త్రీపురుషులు సమానులు కారు కాబట్టి సమానత్వం అనే రూళ్లకర్ర వీరికి వర్తించదు. సమానత్వం సమానుల మధ్యే ఉంటుంది. సమానత్వ భావనను అసమానుల మధ్య వర్తించినట్లయితే అది మరింత అసమానత్వానికి దారితీస్తుంది. అయితే ఈ వ్యత్యాసం వివాహ చట్టాల్లో అంత స్పష్టంగా కనిపించదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు ఇది అత్యంత స్పష్టంగా బోధపడుతుంది. అసమానత్వంతో కూడిన వివాహం వివాహ వ్యవస్థ లోపల మహిళల ప్రతిపత్తి పురుషులతో పోలిస్తే చాలా వ్యత్యాసంతో ఉంటుంది. పురుషుడు సంపాదనాపరుడు, అతడి సంపాదనను ఆర్థిక పదబంధాలతో కొలుస్తారు. మహిళ గృహిణి, అంతేకాకుండా వివాహ వ్యవస్థ లోపల ఆమె అధీనురాలి స్థితిలో ఉంటుంది. ఆమె కుటుంబం, సమాజానికి చెందిన సాంస్కృతిక నియమాలను నిలబెట్టే స్థానంలో ఉంటుంది. అయితే వివాహ చట్టాల్లోపల వధూవరుల మధ్య ఉంటున్న ఈ అసమానతా స్థితిని ఎవరూ గుర్తించరు. ఇక విడాకులకు ప్రయత్నిస్తున్నప్పుడు స్త్రీపురుషులిరువురూ తమ పిటిషన్లను ఒకే నిర్దిష్ట భూమికపై సమర్పించాల్సి ఉంటుంది. అవేమిటంటే – వ్యభిచారం, పారిపోవడం, క్రూరత్వం. విడాకుల లిటిగేషన్లో న్యాయస్థానాల ముందుకు వచ్చే అంశాలను పరిశీలిద్దాం. సమయానికి భోజనం సిద్ధం చేయకపోవడం, భర్త పని నుంచి ఇంటికి తిరిగి రాగానే టీ ఇవ్వకపోవడం (భార్య సంపాదనాపరురాలిగా ఉంటున్నప్పటికీ ఈ సేవ చేయాల్సిందే), సెక్స్‌కి వ్యతిరేకించడం, గర్భాన్ని తీసేసుకోవడం, తన మరుదుల సమక్షంలో లేక బహిరంగంగా ఉంటున్నప్పుడు తలకు వస్త్రం కప్పుకోకపోవడం, వివాహానికి సంకేతమైన సిందూరం లేదా మంగళసూత్రాన్ని ధరించడాన్ని తిరస్కరించడం, ఉమ్మడి కుటుంబానికి దూరంగా విడిగా వేరే ఇంట్లో ఉండాలని డిమాండ్ చేయడం, వరకట్నం తీసుకున్నాడని సెక్షన్ 498ఏ కింద కేసుపెట్టడం వగైరా కారణాలు విడాకుల పిటిషన్లో కనబడుతుంటాయి. విడాకులు కోరుకుంటున్న భార్యలు తమ భర్తల క్రూరత్వానికి వీటినే ఉదాహరణలుగా చూపి కోర్టును అభ్యర్థిస్తుంటారు. అయితే మహిళలు విడాకులు కోరుతూ తమ పిటిషన్లలో చెప్పే కారణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి ప్రధానంగా వారి ప్రాథమిక ఉనికికి సంబంధించి ఉంటాయి. అత్తింటి నుంచి తనను బయటకు గెంటేయడం, పదే పదే కట్నాన్ని డిమాండ్ చేయడం, మరింత కట్నం ఇవ్వలేదని భార్య తల్లితండ్రులను అవమానించడం, స్త్రీ ధనంగా వచ్చిన భార్య నగలను, విలువైన వస్తువులను లాక్కుని వాటిని ఆమెకు తిరిగి ఇవ్వకపోవడం, రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వకపోవడం, ఉద్యోగం చేయనీయకుండా అడ్డుకోవడం, ఆమె జీతాన్ని లాగేసుకోవడం, ఆమె నైతిక వర్తనపై నిందలు మోపడం... లైంగికంగా, భావోద్వేగపరంగా, సెక్స్ పరంగా దూషించటం, పిల్లలను తన చెంతకు రానివ్వకపోవడం వంటి కారణాలతో మహిళలు విడాకుల పిటిషన్ సమర్పిస్తుంటారు. పితృస్వామ్య సామాజిక నిర్మాణంలో మహిళలు అనేక సందర్భాల్లో తమ పుట్టింటిని వదిలి భర్త ఇంటికి రావడం కద్దు. తనకు నచ్చిన ఇంటిలో ఉండటం అనే స్త్రీల హక్కును ఇటీవలి వరకు ఎవరూ గుర్తించలేదు. ప్రసవం కోసం భార్యను పుట్టింటికి పంపినప్పుడు, భర్త ఆమె మళ్లీ తన ఇంటికి రాకుండా అడ్డుకుంటాడు. తర్వాత విడాకుల్ని కోరుకుంటాడు. భర్త వాస్తవంగానే తన భార్య పునరాగమనాన్ని నిరోధిస్తున్నప్పుడు నిర్మాణాత్మకంగా వారిని వేరు చేయడం ఎలా అని సూత్రీకరించడానికి కోర్టులకు చాలా సమయం పట్టింది. కాబట్టి విడాకుల భూమిక కూడా స్త్రీపురుషులను వేరు చేస్తోందని గమనించవచ్చు. మహిళల శరీరాలూ... ఆస్తే మరి! ఐపీసీ సెక్షన్ 497 కింద వ్యభిచారంపై చట్టాన్ని పరిశీలించినప్పుడు ఇదేం వైపరీత్యం అనిపించింది. దీన్ని 2018 సెప్టెంబర్‌లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపడేసిందనుకోండి. 158 సంవత్సరాల ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్యతో ఎవరైనా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది భర్త పట్ల నేరం చేసినట్లు అవుతుంది. కానీ ఇదే సూత్రాన్ని మహిళ పట్ల ఈ చట్టం వర్తింపజేయలేదు. ఈ చట్టం కింద మహిళను శిక్షించలేరు. కానీ ఈ నిబంధన ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని సవాలు చేసినప్పుడు సమానత్వ ప్రతిజ్ఞ నుంచి దాన్ని కాపాడటానికి కోర్టులు పితృస్వామిక సిద్ధాంతంపై ఆధారపడేవి. దీన్ని మహిళకు అనుకూలమైన సంరక్షణ చర్యగా చూసేవారు. మహిళలకు దీనిద్వారా కలిగిన ప్రమాదాన్ని న్యాయప్రక్రియ అరుదుగా మాత్రమే గుర్తించింది. కానీ జెండర్ కోణం నుంచి దీన్ని చూసినప్పుడు మహిళలు నిష్క్రియాత్మకంగా, స్తబ్దుగా ఉంటారని, తమ శరీరాల పట్ల తమ లైంగిక వాంఛల పట్ల కూడా వారు నిర్ణయాలు తీసుకోలేరని ఈ చట్టం భావిస్తున్నట్లు బోధపడుతుంది. వివాహం తర్వాత మహిళ శరీరం భర్తకే చెందుతుందని ఇది భావిస్తోంది. విక్టోరియన్ యుగం లైంగిక నీతి చట్రంపై ఆధారపడి, మహిళతో లైంగిక సంబంధం పెట్టుకునే విషయంలో ఇద్దరు పురుషుల మధ్య సమస్యగా మాత్రమే దీన్ని చూస్తూవచ్చారు. చట్టం ఈ విషయంలో పురుషుడిని మాత్రమే నేరస్థుడిని చేసినప్పటికీ సారాంశంలో ఇది మహిళా వ్యతిరేకమైంది. ఇది మహిళలను చరాస్తిగా, గృహోపకరణంగా భావిస్తూ భార్యపై భర్తకు ఆస్తి హక్కుకు చట్ట సమ్మతి కలిగించేది. ఏ వ్యక్తి అయినా మరొక వ్యక్తి భార్యను అతడి సమ్మతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది ఆ భర్త హక్కును ఉల్లంఘిస్తున్నట్లుగానే చట్టం భావించేది. ఎందుకంటే తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునే అంశం కూడా పూర్తిగా భర్తకు చెందిన హక్కుగానే భావించేవారు. ఇలాంటి పురుష పాక్షిక చట్టాన్ని 158 సంవత్సరాల తర్వాత మాత్రమే న్యాయవ్యవస్థ కొట్టి పడేసింది. అంతవరకు పురుషుడు మాత్రమే హేతుబద్దంగా ఆలోచిస్తాడు అని సాధారణంగా సమాజంలో బలపడిన అభిప్రాయమే న్యాయ మీమాంసలో కూడా ఉండేది. రీజనబుల్ మ్యాన్ అనే భావనపై మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీదేవన్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ఆర్డినరీ ఉమన్ అనే వ్యాసంలో ప్రశ్నించారు. తటస్థత కూడా పక్షపాతమేనా? ముగించేముందు ఈ వ్యాసం ప్రారంభంలో వేసిన ప్రశ్నను మళ్లీ సంధిస్తున్నాను. ఫెమినిజం దృక్కోణం కానీ దాని వెలుగులో మహిళల హక్కులను ప్రస్తావించడం కానీ పక్షపాత దృష్టి అని ముద్రవేయవచ్చా? దీనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సరైన సమాధానం ఇచ్చారు. 2018 అక్టోబర్‌లో ఓపీ జిందాల్ లా స్కూల్లో ఫెమినిజం ఇన్ ప్రాక్టీస్, ఫెమినిస్ట్ లాయరింగ్ అండ్ ఫెమినిస్ట్ జడ్జింగ్ అనే అంశంపై నిర్వహించిన చర్చాక్రమంలో ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రకటన చేశారు.‘ఒక న్యాయమూర్తిగా మీరు రాజ్యాంగంలోని అత్యవసర విలువలను ఎత్తిపడుతూ ఆ రాజ్యాంగ సారాంశమైన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను బలపరుస్తారు. ఈ కోణంలో మీరు ఫెమినిస్టు సూత్రాలను వర్తింపజేస్తున్నప్పుడు రాజ్యాంగంలోని సమానత్వ భావనకు మరింత బలం చేకూరుస్తారంతే’. ఈ సందర్భంలోనే రాజ్యాంగమే తనకు తానుగా ఫెమినిస్టుగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన చక్కటి సమాధానం ఇచ్చారు. ‘ఫెమినిజం అంటే సామాజిక అంతరాల వ్యవస్థను విచ్ఛిన్నపర్చటమే కదా. సరిగ్గా భారత రాజ్యాంగ లక్ష్యం కూడా అదే. సమాజంలో పరివర్తన జరగాలంటే ఉనికిలో ఉన్న సామాజిక నిర్మాణాలను విచ్ఛిన్నపర్చాల్సిందే’. మన దేశంలోని న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి తమను పక్షపాతం చూపుతున్న జడ్జీలుగా ముద్రిస్తారనే భయం వీడి, మహిళా కేంద్రక న్యాయమీమాంసకు వీరు ప్రాధాన్యం ఇవ్వాలి. మహిళల హక్కును కాపాడటానికి మహిళ న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అవసరం. అదే సమయంలో పితృస్వామిక స్వభావంతో కూడిన తటస్థతను ప్రదర్శించనందుకు వారు క్షమాపణ చెప్పాల్సి వస్తే మహిళా జడ్జీల నియామకం ఒక విఫల ప్రాజెక్టు అయిపోతుంది. కానీ మహిళా జడ్జీల నియామకం ప్రక్రియ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేసినట్లుగా రాజ్యాంగ విలువలను మరింత సమున్నతంగా ఎత్తిపడుతూనే, ఫెమినిస్టు న్యాయమీమాంస పరిణామానికి గణనీయంగా తోడ్పడుతుంది. – ఫ్లేవియా ఏగ్నెస్, మహిళా హక్కుల న్యాయవాది -
వారి మధ్య పెళ్లి ఆమోదయోగ్యం కాదు:హైకోర్టు
చండీగఢ్: హిందూ వివాహ చట్టం ప్రకారం తోబుట్టుల మధ్య వివాహం చట్ట విరుద్దమని పంజాబ్ హర్యానా హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్లో అమ్మాయి మేజర్ అని తెలిపినప్పటికీ ఇది న్యాయ సమ్మతం కాదని కేసును విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన పిటిషనర్ తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 366 ఏ(మైనర్ అమ్మాయిని అనుమతి లేకుండా తీసుకెళ్లడం) వంటి సెక్షన్లు ఖన్నాసిటిలోని రెండవ ఠాణాలో నమోదయ్యాయని, వాటిపై ముందస్తు బెయిల్ మంజూర్ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జీవిత రక్షణ,స్వేచ్ఛ కోసం పిటిషనర్‌తో కలిసి బాలిక క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు అతని తరుపు న్యాయవాది అరవింద్ సింగ్ సాంగ్వాన్ కోర్టుకు నివేదించాడు. ఈ ముందస్తు బెయిల్‌ను ప్రభుత్వ తరుపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. వారిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలు కావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. పిటిషన్ పరీశీలించిన న్యాయమూర్తి వారిద్దరూ కలిసి ఉంటున్నారని అంటున్నారు, కానీ నివేదికనూ చూస్తే తనకు కేవలం 17 సంవత్సరాల మాత్రమే ఉన్నాయని అన్నారు. బాలిక పుట్టిన తేదీ 2003 ఆగస్ట్ అని,సెప్టెంబర్ 3,2020 నాటికీ 17 సంవత్సరాల 14 రోజులని న్యాయమూర్తి అన్నారు. కేవలం మగ సోదరులని మాత్రమే వాళ్ల తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని, మైనర్ని వేధిస్తున్నారని బాలిక ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ దీనికి జతపర్చాడు. అందుకోసం తనతో కలిసి జీవించాలని బాలిక నిర్ణయించుకుందని వాదించాడు. తన సొంత తల్లిదండ్రుల నుంచి ప్రాణానికి హాని ఉందన్నారు. తనను వేధించకుండా చూడాలని వేసిన పిటిషన్‌ని, కోర్టు సెప్టెంబర్ 7 న కొట్టివేసింది. ప్రభుత్వం ఇద్దరికి రక్షణ కల్పించాలని ఆదేశిందని న్యాయమూర్తి అన్నారు. ఏది ఏమైన చట్ట ఉల్లంఘన కోసం చట్టపరమైన చర్యల నుంచి రక్షించడానికి ఈ ఉత్తర్వూ ఇవ్వరాదని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్లో తాను బాలికకూ సోదరుడినవుతాననే విషయాన్ని వెల్లడించలేదని ,అందువల్ల 18 సంవత్సరాలు నిండిన తరువాత కూడా వారు చేసుకున్న పెళ్లి చట్ట సమ్మతం కాదని అంది." పిటిషనర్ హిందూ వివాహ చట్టం క్రింద నిషేధించబడిన 'సపిందా'లో (ఇద్దరు వ్యక్తుల మధ్య ఉమ్మడి పూర్వీకులు ఉంటే వారి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది) వస్తారని, ఒకరితో ఒకరు వివాహం చేసుకోలేరని అని ప్రభుత్వ న్యాయవాది" వాదనలతో కోర్టు ఏకీభవించింది., ఇది అనైతికం, సమాజంలో ఆమోద యోగ్యం కాదని పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. -
రెండో వివాహం చెల్లుతుంది : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది. విడాకుల పిటిషన్ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15ను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. ఇరు వర్గాలు(భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో సెక్షన్ 15 వర్తించదని తెలిపింది. విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. తన భార్యతో విడాకులు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే పిటిషన్‌దారుడు మరో వివాహం చేసుకున్నారు. తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తమ విడాకులకు అనుమతివ్వాలని కోర్టు కు విజ్ఞప్తి చేశారు. తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. కానీ, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘హిందూ వివాహ చట్టం సామాజిక సంక్షేమానికి ఉద్దేశించిన, ఉదారవాద చట్టం. ఈ చట్టం అసలు లక్ష్యం చాటేలా భాష్యం చెప్పాల్సి ఉంది’ అని బెంచ్ పేర్కొంది. చట్టంలో ఏముందంటే.. ∙సెక్షన్ 5(1): జీవిత భాగస్వామి బతికి ఉండగా మరో వివాహం చేసుకోరాదు ∙సెక్షన్ 11: అలాంటి వివాహాలు చెల్లుబాటు కావు ∙సెక్షన్ 15: విడాకులు పొందిన వారు మళ్లీ ఎప్పుడు వివాహం చేసుకోవాలో చెబుతుంది -
మనస్పర్థలొస్తే తెగతెంపులే!
హైదరాబాద్: నేటి ఆధునిక జీవితంలో ఆలూమగల మధ్య తలెత్తే మనస్పర్థలు వారిని ఎక్కువగా తెగతెంపుల వైపు నెట్టేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగవులు విడాకులకు దారితీస్తున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, ఉద్యోగ తీరుపై అభ్యంతరాలు, వ్యక్తిత్వాల్లో వ్యత్యాసం వంటి కారణాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. దంపతుల మధ్య సయోధ్య కుదిరే కేసులు తక్కువగా ఉంటుండగా కోర్టును ఆశ్రయిస్తున్న సందర్భాలు అధికంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో మహిళలు ముందుగా గృహహింస చట్టాన్ని ఆశ్రయిస్తున్నారు. వేలల్లో కేసులు... రాష్ట్రవ్యాప్తంగా గృహహింస చట్టం కింద ప్రస్తుతం 15,235 ఫిర్యాదులు దాఖలవగా వాటిలో కేవలం 1,429 ఫిర్యాదులకు సంబంధించి మాత్రమే ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. అధికారుల కౌన్సెలింగ్ ఫలితంగా వారంతా ఫిర్యాదులను వెనక్కు తీసుకున్నారు. కానీ మరో 10,779 ఫిర్యాదులకు సంబంధించి పరిష్కారం జటిలం కావడంతో డీఐఆర్ (డొమెస్టిక్ ఇన్సిడెన్ట్ రిపోర్టు) నమోదు అనివార్యమైంది. వీటిలో 818 కేసులకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు వెలువడగా 2,383 కేసులకు కోర్టులు తుది ఉత్తర్వులు జారీ చేశాయి. మిగతా కేసులు విచారణలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అధికం... గృహహింస చట్టం కింద పట్టణ ప్రాంత పరిధిలోనే అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో చదువుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉంటున్నారు. మరోవైపు మైనారిటీ వర్గాల్లో రెండో పెళ్లికి సంబంధించిన ఫిర్యాదులు సైతం ఎక్కువగానే ఉంటున్నాయి. గృహహింస చట్టం కింద నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా పోలీస్ స్టేషన్ నుంచి రిఫర్ చేసినవాటి సంఖ్య అధికంగా ఉంటోంది. ముందుగా పోలీస్‌స్టేషన్‌లో 498, 498 (ఏ) సెక్షన్ల కింద కేసుల నమోదుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జైలుకు పంపుతున్నారు. దీంతో ఈ కేసుల్లో ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకోవడం లేదు. డీవీ యాక్ట్ సెల్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో రక్షణ, నివాసపు ఉత్తర్వులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ, నష్టపరిహారం కింద కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం పిల్లల సంరక్షణ మినహా మిగతా అన్ని కేటగిరీల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. చట్టంపై అవగాహన కల్పిస్తుండడంతో బాధిత మహిళల సంఖ్య వెలుగులోకి వస్తోంది. జిల్లాలు పెరిగినా అధికారుల సంఖ్య అంతంతే.. రాష్ట్రంలో జిల్లాల వారీగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ.. డీవీ యాక్ట్ సెల్స్ మాత్రం పాత జిల్లాల్లోనే పనిచేస్తున్నాయి. ఒక్కో సెల్లో ఇద్దరు కౌన్సెలింగ్ అధికారులున్నారు. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండగా.. వాటిని పరిష్కరించే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 4,027 కేసులుండగా ఇద్దరు కౌన్సెలింగ్ అధికారులు మాత్రమే ఉన్నారు. రాజధానిలో మరికొంత సిబ్బందిని పెంచితే పరిష్కారం సులభతరం అవుతుందని డీవీ యాక్ట్ సెల్ అధికారి కవిత ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
వివాహ చట్టాల సవరణకు బ్రేక్
ప్రజల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో పక్కనపెట్టిన కేంద్రం న్యూఢిల్లీ: హిందూ వివాహ చట్టంతోపాటు ప్రత్యేక వివాహ చట్టాన్ని మహిళలకు మరింత అనుకూలంగా మార్చేందుకు వీలుగా చట్టసవరణ బిల్లు తేవాలనుకున్న కేంద్రం ప్రస్తుతం దాన్ని పక్కనపెట్టింది. సవరణ బిల్లులో నిబంధనలను వ్యతిరేకిస్తూ విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదా కేబినెట్ నోట్‌ను 2014 సెప్టెంబర్‌లో అంతర్‌మంత్రిత్వశాఖల సంప్రదింపుల కోసం పంపింది. అయితే ప్రజా వ్యతిరేకతో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు దాన్ని లోతుగా పరిశీలించాలని న్యాయశాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన న్యాయశాఖ మంత్రి సదానంద తాము పూర్తిగా ఈ బిల్లును తోసిపుచ్చలేదని, తాత్కాలికంగా నిలిపేశామన్నారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే భర్త తన స్థిరాస్తిలో భార్య, పిల్లలకు తగిన పరిహారం చెల్లించాలనే నిబంధన ను కేంద్రం ఈ సవరణ బిల్లులో పొందుపరిచింది. భర్తకు వారసత్వంగా సంక్రమించిన లేదా సంక్రమించే ఆస్తి నుంచి భార్య, పిల్లలకు పరిహారాన్ని అందించాలని, ఆ పరిహారాన్ని కోర్టులు నిర్ణయించాలని ప్రభుత్వం ఇందులో ప్రతిపాదించింది. విడాకుల కేసుల్లో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా ఆయా కేసుల్లో భార్యాభర్తల్లో ఎవరైనా మూడేళ్లు దాటాక పరస్పర అంగీకారంతో రెండో ‘సంయుక్త దరఖాస్తు’ దాఖలు చేయకున్నా విడాకులు మంజూరు చేసే విచక్షణాధికారాన్ని కోర్టులకు అప్పగించాలని ప్రతిపాదించింది. గొడవల కారణంగా వివాహ బంధాన్ని తిరిగి గాడినపెట్టడం కుదరనప్పుడు ఆ కారణాన్ని చూపుతూ విడాకులు కోరే అవకాశాన్ని పొందుపరిచారు. -
'దస్తావేజులపై రాసుకునే విడాకులకు చట్టబద్ధత లేదు'
ముంబై: దస్తావేజులపై రాసుకునే విడాకులకు చట్టబద్ధత లేదని, అవి చెల్లవని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దంపతులిద్దరూ పరస్పర అంగీకారంపై విడాకులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ఆర్నెల్ల పాటు వేచియుండే కాలపరిమితి నిబంధనను మినహాయించి తమకు విడాకులు మంజూరు చేయాలంటూ ఒక జంట దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ముంబైకి చెందిన మిట్టల్, మనోజ్ పంచాల్ 2007, ఏప్రిల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే ఏడాదిలోపే వారి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో విడిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకొన్నారు. 2011, జూన్‌లో దస్తావేజులపై రాసుకొని, విడాకులు తీసుకొన్నారు. ఇలా దస్తావేజులతో పొందే విడాకులకు చట్టబద్ధత లేదన్న విషయం ఆ సమయంలో వారికి తెలియదు. తర్వాత వారిద్దరూ వేర్వేరు వ్యక్తులను మళ్లీ వివాహం చేసుకున్నారు. మనోజ్ పంచాల్ భర్త అమెరికాలో స్థిరపడటంతో ఆమె వీసా కోసం దరఖాస్తు చేసింది. అయితే విడాకులకు సంబంధించి కోర్టు డిక్రీని సమర్పించాలని అమెరికా దౌత్య కార్యాలయం తేల్చి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె మొదటి భర్త మిట్టల్ సహకరించేందుకు అంగీకరించారు. విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత ఆర్నెల్ల పాటు దంపతులు తప్పనిసరిగా వేచిఉండాలన్న నిబంధనను మినహాయించి తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ మనోజ్ పంచాల్, మిట్టల్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
'హిందూ వివాహ చట్టానికి లోబడితేనే రద్దు కోరగలరు'
ముంబై: ఒక హిందువు ఇతర మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. హిందూ వివాహచట్టం కింద విడాకులు కోరజాలరని బాంబే హైకోర్టు విస్పష్ట తీర్పు చెప్పింది. ఇదే విషయమై నిరంజని రోషన్రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ వీకే తాహిల్మ్రణి నేతత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది. నిరంజని పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ వివాదాల పరిష్కార(ఫ్యామిలీ) కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు బెంచ్ పూర్తిగా సమర్థించింది. నిరంజని 1999లో రోషన్పింటో అనే క్రిస్టియన్‌ను హిందూ వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎవరికి వారు తమ మత సంప్రదాయలను పాటిస్తూ వస్తున్నారు. నిరంజని ఇదే కారణాన్ని చూపిస్తూ తమ వివాహం చెల్లుబాటు కాదని.. దానిని రద్దు చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. రోహన్ క్రిస్టియన్ అయినందున తమ వివాహం, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 (వివాహ సమయంలో ఇద్దరూ హిందువులే అయి ఉండాలి) కు విరుద్ధమని.. కనుక రోషన్ నుంచి విడాకులు ఇప్పించాలని కోరారు. ఫ్యామిలీ కోర్టు నిరంజని వాదనలను తోసిపుచ్చుతూ ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. వివాహ సమయంలో ఇద్దరూ హిందువులు కానందున, హిందూ వివాహ చట్టం నిబంధనలను పాటించనందున.. ఆ చట్టం కింద విడాకులు కోరుతూ పిటిషన్ వేసే హక్కు లేదని స్పష్టం చేసింది. దీంతో నిరంజని బోంబే హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా న్యాయమైనవని.. వాటిలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేస్తూ నిరంజని పిటిషన్‌ను కొట్టివేసింది. -
‘మొదటి పెళ్లిని దాస్తే రెండోభార్యకు భరణం ఇవ్వాలి’
న్యూఢిల్లీ: హిందూ వివాహ చట్టం ప్రకారం రెండో పెళ్లి చట్టవిరుద్ధమైనప్పటికీ రెండవ భార్య భరణానికి అర్హురాలేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. జస్టిస్ రంజనా ప్రకాశ్, జస్టిస్ సిక్రీలతో కూడిన ధర్మాసనం ఒక కేసును విచారిస్తూ ఈ తీర్పునిచ్చింది. రెండవ భార్యకు భరణం ఇవ్వాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మొదటి వివాహాన్ని దాచి రెండవసారి పెళ్లి చేసుకుంటే రెండవ భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఆ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రెండవ భార్య భరణానికి అర్హురాలు కాదని గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూలింగ్‌కు సవరణ చేయకపోతే భర్తలు ఇలా రెండవ పెళ్లి చేసుకొని రెండవ భార్యలను గాలికి వదిలేస్తారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మొదటి వివాహాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి రెండవ పెళ్లి చేసుకుంటే ఆ రెండవ భార్యకు చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుందని, ఆమె భరణం పొందడానికి అర్హురాలేనని ధర్మాసనం తెలిపింది. మొదటి వివాహం జరిగి భార్య జీవించి ఉన్నట్టు తమకు తెలిసీ పెళ్లి చేసుకునే మహిళలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేశారు.