ముంబై: దస్తావేజులపై రాసుకునే విడాకులకు చట్టబద్ధత లేదని, అవి చెల్లవని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దంపతులిద్దరూ పరస్పర అంగీకారంపై విడాకులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ఆర్నెల్ల పాటు వేచియుండే కాలపరిమితి నిబంధనను మినహాయించి తమకు విడాకులు మంజూరు చేయాలంటూ ఒక జంట దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ముంబైకి చెందిన మిట్టల్, మనోజ్ పంచాల్ 2007, ఏప్రిల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
అయితే ఏడాదిలోపే వారి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో విడిపోవాలని ఇద్దరూ నిర్ణయించుకొన్నారు. 2011, జూన్‌లో దస్తావేజులపై రాసుకొని, విడాకులు తీసుకొన్నారు. ఇలా దస్తావేజులతో పొందే విడాకులకు చట్టబద్ధత లేదన్న విషయం ఆ సమయంలో వారికి తెలియదు. తర్వాత వారిద్దరూ వేర్వేరు వ్యక్తులను మళ్లీ వివాహం చేసుకున్నారు. మనోజ్ పంచాల్ భర్త అమెరికాలో స్థిరపడటంతో ఆమె వీసా కోసం దరఖాస్తు చేసింది. అయితే విడాకులకు సంబంధించి కోర్టు డిక్రీని సమర్పించాలని అమెరికా దౌత్య కార్యాలయం తేల్చి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె మొదటి భర్త మిట్టల్ సహకరించేందుకు అంగీకరించారు. విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత ఆర్నెల్ల పాటు దంపతులు తప్పనిసరిగా వేచిఉండాలన్న నిబంధనను మినహాయించి తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ మనోజ్ పంచాల్, మిట్టల్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.