ముంబై: ఒక హిందువు ఇతర మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. హిందూ వివాహచట్టం కింద విడాకులు కోరజాలరని బాంబే హైకోర్టు విస్పష్ట తీర్పు చెప్పింది. ఇదే విషయమై నిరంజని రోషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ వీకే తాహిల్మ్రణి నేతత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది. నిరంజని పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ వివాదాల పరిష్కార(ఫ్యామిలీ) కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు బెంచ్ పూర్తిగా సమర్థించింది. నిరంజని 1999లో రోషన్‌పింటో అనే క్రిస్టియన్‌ను హిందూ వివాహ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎవరికి వారు తమ మత సంప్రదాయలను పాటిస్తూ వస్తున్నారు.
నిరంజని ఇదే కారణాన్ని చూపిస్తూ తమ వివాహం చెల్లుబాటు కాదని.. దానిని రద్దు చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. రోహన్ క్రిస్టియన్ అయినందున తమ వివాహం, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 (వివాహ సమయంలో ఇద్దరూ హిందువులే అయి ఉండాలి) కు విరుద్ధమని.. కనుక రోషన్ నుంచి విడాకులు ఇప్పించాలని కోరారు. ఫ్యామిలీ కోర్టు నిరంజని వాదనలను తోసిపుచ్చుతూ ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. వివాహ సమయంలో ఇద్దరూ హిందువులు కానందున, హిందూ వివాహ చట్టం నిబంధనలను పాటించనందున.. ఆ చట్టం కింద విడాకులు కోరుతూ పిటిషన్ వేసే హక్కు లేదని స్పష్టం చేసింది. దీంతో నిరంజని బోంబే హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు పూర్తిగా న్యాయమైనవని.. వాటిలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేస్తూ నిరంజని పిటిషన్‌ను కొట్టివేసింది.