పెళ్లికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హిందూ వివాహ చట్టప్రకారం వివాహం చేసుకున్న ఎస్టీలకు అదే చట్టప్రకారం విడాకులు ఇవ్వవచ్చని.. అయితే పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన ఓ గిరిజన (లంబాడ) దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కామారెడ్డి సివిల్ కోర్టును ఆశ్రయించారు.
ఎస్టీకి చెందిన వారికి హిందూ వివాహ చట్టం సెక్షన్ 2(2) వర్తించదని కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిపై దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సృజన్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు పూర్తిగా హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహం చేసుకున్నారని.. పెళ్లి కార్డు సహా ఇతర ఆధారాలన్నీ పరిశీలించాల్సిన ట్రయల్ కోర్టు ఆ పని చేయలేదన్నారు.
హిందూ లంబాడా వర్గానికి చెందిన వారని.. హిందూ వివాహ చట్టం వారికి వర్తించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు లంబాడా వర్గానికి చెందిన వారైనా వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున ట్రయల్ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి ఆ మేరకు విడాకులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.
అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 2(2).. ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న ఎస్సీలకు వర్తించదని, ఈ కేసుకు మాత్రమే పరిమితమని చెప్పారు. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కొట్టివేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment