హిందూ వివాహ చట్టం 1955కి రూపకల్పన జరిగింది. అయితే ఈ చట్టం స్త్రీల పట్ల వివక్ష చూపుతోందనే విమర్శలూ ఉన్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది కానీ కుటుంబం లోపల వివాహ వ్యవస్థలో స్త్రీపై పురుషుడి ఆధిక్యత కొనసాగుతూనే ఉందన్నది కొందరు స్త్రీవాదుల పరిశీలన.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని మనం పరిశీలించినప్పుడు వివక్ష అన్నది స్పష్టంగా కనిపిస్తుంది అని మహిళా హక్కుల న్యాయవాదుల అభిప్రాయం. ‘‘వివాహ వ్యవస్థ లోపల మహిళల ప్రతిపత్తి పురుషులతో పోలిస్తే చాలా వ్యత్యాసంతో ఉంటుంది. పురుషుడు సంపాదనాపరుడు, అతడి సంపాదనను ఆర్థిక పదబంధాలతో కొలుస్తారు. మహిళ గృహిణి. అంతే కాకుండా వివాహ వ్యవస్థ లోపల ఆమె అధీనురాలి స్థితిలో ఉంటుంది.
ఆమె కుటుంబం, సమాజానికి చెందిన సాంస్కృతిక నియమాలను నిలబెట్టే స్థానంలో ఉంటుంది. అయితే వివాహ చట్టాల్లోపల వధూవరుల మధ్య ఉంటున్న ఈ అసమానతా స్థితిని ఎవరూ గుర్తించరు. ఇక విడాకులకు ప్రయత్నిస్తున్నప్పుడు స్త్రీపురుషులిరువురూ తమ పిటిషన్లను ఒకే నిర్దిష్ట భూమికపై సమర్పించాల్సి ఉంటుంది.
అవేమిటంటే– వ్యభిచారం, పారిపోవడం, క్రూరత్వం! ఇందులో ఔచిత్యం లేదనిపిస్తుంది’’ అనే కోణం కూడా వారి అభిప్రాయంలో కనిపిస్తుంది. ఏమైనా హిందూ వివాహ చట్టంలో కొన్ని మార్పులైతే తప్పనిసరిగా జరగవలసి ఉందని ఇటీవలి కొన్ని కేసులలో మహిళల తరఫున వాదించే న్యాయవాదులు స్పష్టం చేశారు.
అడ్డుపడుతున్న సెక్షన్ : విడాకుల పిటిషన్ కోర్టులో అపరిష్కృతంగా ఉన్న సమయంలో జరిగిన రెండో వివాహం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు 2018లో స్పష్టతనిచ్చింది. హిందూ వివాహ చట్టంలోని ‘వివాహ అనర్హత’ నిబంధన ద్వారా రెండో వివాహాన్ని రద్దుచేయలేమని ఆ కేసులో జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల ధర్మాసనం తెలిపింది.
విడాకుల పిటిషన్ పరిష్కృతమయ్యే వరకు రెండో వివాహంపై ఆంక్షలు విధించిన హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 15ను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. ఇరు వర్గాలు (భార్యాభర్తలు) కోర్టు బయట సమస్యను పరిష్కరించుకుని, ఇక కేసును కొనసాగించొద్దని నిర్ణయించుకున్న సందర్భంలో సెక్షన్ 15 వర్తించదని తెలిపింది. అంతేకాదు, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది.
తన భార్యతో విడాకులు కోరుతూ దాఖలుచేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలోనే పిటిషన్ దారుడు మరో వివాహం చేసుకున్నారు. తొలి భార్యతో సమస్యను పరిష్కరించుకున్నానని, తమకు విడాకులకు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. కానీ, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండగా జరిగిన వివాహం చెల్లబోదని హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment