హిందూ వివాహ చట్టంతోపాటు ప్రత్యేక వివాహ చట్టాన్ని మహిళలకు మరింత అనుకూలంగా మార్చేందుకు వీలుగా
ప్రజల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో పక్కనపెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ: హిందూ వివాహ చట్టంతోపాటు ప్రత్యేక వివాహ చట్టాన్ని మహిళలకు మరింత అనుకూలంగా మార్చేందుకు వీలుగా చట్టసవరణ బిల్లు తేవాలనుకున్న కేంద్రం ప్రస్తుతం దాన్ని పక్కనపెట్టింది. సవరణ బిల్లులో నిబంధనలను వ్యతిరేకిస్తూ విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదా కేబినెట్ నోట్‌ను 2014 సెప్టెంబర్‌లో అంతర్‌మంత్రిత్వశాఖల సంప్రదింపుల కోసం పంపింది. అయితే ప్రజా వ్యతిరేకతో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు దాన్ని లోతుగా పరిశీలించాలని న్యాయశాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన న్యాయశాఖ మంత్రి సదానంద తాము పూర్తిగా ఈ బిల్లును తోసిపుచ్చలేదని, తాత్కాలికంగా నిలిపేశామన్నారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే భర్త తన స్థిరాస్తిలో భార్య, పిల్లలకు తగిన పరిహారం చెల్లించాలనే నిబంధన ను కేంద్రం ఈ సవరణ బిల్లులో పొందుపరిచింది.
భర్తకు వారసత్వంగా సంక్రమించిన లేదా సంక్రమించే ఆస్తి నుంచి భార్య, పిల్లలకు పరిహారాన్ని అందించాలని, ఆ పరిహారాన్ని కోర్టులు నిర్ణయించాలని ప్రభుత్వం ఇందులో ప్రతిపాదించింది. విడాకుల కేసుల్లో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా ఆయా కేసుల్లో భార్యాభర్తల్లో ఎవరైనా మూడేళ్లు దాటాక పరస్పర అంగీకారంతో రెండో ‘సంయుక్త దరఖాస్తు’ దాఖలు చేయకున్నా విడాకులు మంజూరు చేసే విచక్షణాధికారాన్ని కోర్టులకు అప్పగించాలని ప్రతిపాదించింది. గొడవల కారణంగా వివాహ బంధాన్ని తిరిగి గాడినపెట్టడం కుదరనప్పుడు ఆ కారణాన్ని చూపుతూ విడాకులు కోరే అవకాశాన్ని పొందుపరిచారు.