Minister Gowda
-
వివాహ చట్టాల సవరణకు బ్రేక్
ప్రజల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో పక్కనపెట్టిన కేంద్రం న్యూఢిల్లీ: హిందూ వివాహ చట్టంతోపాటు ప్రత్యేక వివాహ చట్టాన్ని మహిళలకు మరింత అనుకూలంగా మార్చేందుకు వీలుగా చట్టసవరణ బిల్లు తేవాలనుకున్న కేంద్రం ప్రస్తుతం దాన్ని పక్కనపెట్టింది. సవరణ బిల్లులో నిబంధనలను వ్యతిరేకిస్తూ విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదా కేబినెట్ నోట్‌ను 2014 సెప్టెంబర్‌లో అంతర్‌మంత్రిత్వశాఖల సంప్రదింపుల కోసం పంపింది. అయితే ప్రజా వ్యతిరేకతో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు దాన్ని లోతుగా పరిశీలించాలని న్యాయశాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన న్యాయశాఖ మంత్రి సదానంద తాము పూర్తిగా ఈ బిల్లును తోసిపుచ్చలేదని, తాత్కాలికంగా నిలిపేశామన్నారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే భర్త తన స్థిరాస్తిలో భార్య, పిల్లలకు తగిన పరిహారం చెల్లించాలనే నిబంధన ను కేంద్రం ఈ సవరణ బిల్లులో పొందుపరిచింది. భర్తకు వారసత్వంగా సంక్రమించిన లేదా సంక్రమించే ఆస్తి నుంచి భార్య, పిల్లలకు పరిహారాన్ని అందించాలని, ఆ పరిహారాన్ని కోర్టులు నిర్ణయించాలని ప్రభుత్వం ఇందులో ప్రతిపాదించింది. విడాకుల కేసుల్లో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా ఆయా కేసుల్లో భార్యాభర్తల్లో ఎవరైనా మూడేళ్లు దాటాక పరస్పర అంగీకారంతో రెండో ‘సంయుక్త దరఖాస్తు’ దాఖలు చేయకున్నా విడాకులు మంజూరు చేసే విచక్షణాధికారాన్ని కోర్టులకు అప్పగించాలని ప్రతిపాదించింది. గొడవల కారణంగా వివాహ బంధాన్ని తిరిగి గాడినపెట్టడం కుదరనప్పుడు ఆ కారణాన్ని చూపుతూ విడాకులు కోరే అవకాశాన్ని పొందుపరిచారు. -
కాంగ్రెస్ జీరో కావాలి
రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ సాక్షి, బళ్లారి : లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, అండమాన్, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు జీరో ఫలితాలు వచ్చాయని, కర్ణాటకలో ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను జీరో చేయాలని ఓటర్లకు కేంద్ర రైల్వే శాఖా మంత్రి డీవీ సదానందగౌడ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం బళ్లారికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడంతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఇంటికి సాగనంపేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చామని, అయితే రైల్వే బడ్జెట్ మొత్తం కర్ణాటకకు కేటాయించినా ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో సంతోషం ఉండదని చమత్కరించారు. గత బడ్జెట్లో కన్నా ఎక్కువ నిధులు కేటాయించినా, కర్ణాటకకు తక్కువ నిధులు కేటాయించానని పేర్కొనడం సరైన చర్య కాదన్నారు. రైల్వేలలో అత్యాచారాలు, దోపిడీలు అరికట్టేందుకు ప్రత్యేకంగా నాలుగు వేల మంది మహిళా పోలీసులను నియమించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనంత్‌కుమార్, ప్రతిపక్షనేత జగదీష్ శెట్టర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి, బళ్లారి ఎంపీ శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీ శ్రీరాములు బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.