
న్యూఢిల్లీ: భార్య అంటే వస్తువు కాదనీ, ఆమెకు ఇష్టం లేకున్నా కలిసి జీవించాల్సిందిగా భర్త ఆమెను బలవంతపెట్టకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అర్ధాంగితో కలిసి ఉండాలని భర్తకు మాత్రమే ఉంటే సరిపోదనీ, భార్య కూడా కోరుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని పేర్కొంది. తన భర్త తనను హింసిస్తున్నాడనీ, విడాకులు ఇప్పించాలంటూ ఓ వివాహిత కోర్టును ఆశ్రయించిన కేసును జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం విచారించింది. ‘ఆమె వస్తువు కాదు. నీతో కలిసి జీవించాల్సిందిగా ఆమెను నువ్వు బలవంతపెట్టకూడదు. ఆమెకు నీతో ఉండటం ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు మాత్రం నీ భార్యతో కలిసే ఉంటానని ఎలా కోరుకోగలవు? నీ నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిది’అని న్యాయమూర్తులు భర్తకు సూచించారు. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 8కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment