పెళ్లైన ఆరు నెలలకే..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో విషాదం నెలకొంది. కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను కత్తితో పొడిచి అనంతరం తాను పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
వివరాలు.. గ్రామానికి చెందిన మహేష్‌కు ఆరు నెలల క్రితం ప్రియాంక(22)తో వివాహమైంది. అన్యోన్యంగా ఉన్న జంట మధ్య మనస్పర్థలు రావడంతో.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగడంతో.. కోపోద్రిక్తుడైన మహేష్ కత్తితో ప్రియాంకపై దాడి చేసి అనంతరం తానుకూడా పొడుచుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ప్రియాంక అప్పటికే మృతి చెందగా.. మహేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.