కరీంనగర్: ఇది పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలోని పరిస్థితే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న దుస్థితి. ఆస్తులు తమవే అయినా.. పేర్లు మారకపోవడం.. యజమానులు మరణించడం.. వెరిసి ఏంచేయాలో తెలియక వారసులు సతమతమవుతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
అసలేం జరిగింది?
ఒకప్పుడు గ్రామాల్లో ఆస్తుల బదిలీ రెండు రకాలుగా జరిగేది. మొదటిది వారసుల పేరు మీదికి.. రెండోది ఇంటిని కొన్న వారి పేర మ్యుటేట్ అయ్యేవి. ఇందుకు సంబంధించిన ‘ఇ–పంచాయత్’ వెబ్‌సైట్‌లో మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఇందుకోసం రెండు ఆప్షన్లు అందుబాటులో ఉండేవి. అందులో మొదటిది విరాసత్, రెండోది కోర్టు డిక్రీ. ఇందులో ఇంటి యజమానులు తమ ఆస్తులను విరాసత్ దరఖాస్తు ద్వారా వారసులకు ఇచ్చేవారు.
రెండు కొనుగోలు చేసుకున్న వారు కోర్టు డిక్రీ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఈ దరఖాస్తులను గ్రామ పంచాయతీ సెక్రటరీ విచారణ జరిపిన తర్వాత ఆస్తి మ్యుటేట్ అయ్యేది. గతంలో ఎడిట్ ఆప్షన్ ఉండేది. దీంతో ఏమైనా తప్పులు ఉన్నా దాన్ని అక్కడే పరిష్కరించుకునేవారు. ఇది చాలా వేగవంతమైన ప్రక్రియ తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యేది.
ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి టీఎస్, బీపాస్ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. గ్రాపపంచాయతీ ఆస్తుల రిజిస్ట్రేషన్లు అన్నీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. దీంతో ‘ఇ–పంచాయత్’ వెబ్‌సైట్లో విరాసత్, కోర్టు డిక్రీ ఆప్షన్లు మాయమయ్యాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు బదిలీ కాక అలాగే మిగిలిపోతున్నాయి.
సమస్య ఏంటి?
నాలుగు జిల్లాల్లోని గ్రామాల్లో వేలాది ఇండ్లకు సరైన ధ్రువపత్రాలు లేవు. దశాబ్దాల తరబడి వారసత్వంగా ఇండ్లు చేతులు మారుతున్నాయి. వాటికి ఇంటి నెంబర్లు ఉంటాయి. ఏటా ఇంటి పన్నులు కడుతారు. కానీ.. ఆ ఇల్లు కొన్నట్లు, కట్టినట్లు ఎలాంటి పత్రాలు లేవు. వాస్తవానికి గ్రామపంచాయతీల ఆవిర్భవానికి ముందు నుంచే ఆ ఇళ్లు మనుగడలో ఉన్నాయి. ఇలాంటి ఇళ్ల పరిస్థితుల్లో ప్రధానమైన చిక్కులు తలెత్తుతున్నాయి.
అడ్డంకులివే..
► ఇంటి యజమానులు లేకుంటే ఆ ఇళ్లు వారసుల పేరిట బదిలీ కావడం లేదు. యజమాని బతికుంటే విరాసత్ సజావుగా సాగుతున్నాయి.
► ఇంటి నెంబరు, ఇంటి పన్నులు కట్టిన కాగితాలు తప్ప ఇంటికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేని ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
► ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లు.. అంతకుముందు సరైన డాక్యుమెంట్లు లేని ఇండ్లను చాలామందే కొనుగోలు చేశారు. వీటిలో చాలామటుకు మ్యుటేషన్ కాలేదు. టీఎస్ బీపాస్‌తో ఆస్తులు మ్యుటేషన్ కాకపోవడంతో ఆఫీసర్లు పక్కన పెడుతున్నారు.
► గతంలో రేకుల ఇల్లు/ పెంకుటిల్లును కూల్చి, గ్రామంలో కొత్తగా జీ 2 నిర్మించుకున్నా సరే ఆన్‌లైన్‌లో ఇంకా పాత రేకుల ఇల్లు/ పెంకుటిల్లుగానే చూపెడుతోంది. ‘ఎడిట్’ ఆప్షన్ లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న యజమానులు, పన్నులు రాక పంచాయతీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇబ్బందులివీ..
► కుటుంబ అవసరాలకు ఇంటిని విక్రయించాలనుకుంటున్న వారికి పేరుమార్పిడి నిబంధన ఇబ్బందికరంగా మారింది.
► పెళ్లీళ్లు, అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు.
► ఆస్తులు అమ్మాలనుకుంటున్న వారు పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, వార్డు మెంబర్ల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
► వృద్ధులు, నిరక్షరాస్యులు ఏంతెలియక సతమతమవుతున్నారు. ఇంకొన్నిచోట్ల ఇదే అదనుగా కొందరు ఇదిచేస్తాం.. అదిచేస్తామంటూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు.
► గతంలో ఇంటిని కొన్నాక.. ఇప్పుడు మ్యుటేషన్ కాకపోవడంతో కొనుగోలుదారుడు, విక్రయదా రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పేరు మారని ఆస్తులు మాకేందుకంటూ నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment