జంగమయ్యకు బియ్యం సమర్పిస్తున్న జనం
రాజన్న సిరిసిల్ల: చనిపోయిన పెద్దల జ్ఞాపకార్థం పితృ అమావాస్య నాడు బియ్యం ఇవ్వడం సంప్రదాయం. ఏటా పితృ అమావాస్య రోజున సిరిసిల్ల ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఉదయమే జంగమయ్యకు బియ్యం, కూరగాయలు ఇస్తుండడం కనిపిస్తుంటుంది. చనిపోయిన వారిని జ్ఞప్తికి తెచ్చుకోవడం.. వారి పేరిట దాన ధర్మాలు చేయడం దీని ఉద్దేశం.
పితృ పక్షంలోనే..
మహాలయ పక్షంలోని పదిహేను రోజులు చనిపోయిన తమ కుటుంబాల్లోని పెద్దలకు బియ్యం ఇస్తుంటారు. శుక్రవారం నాటి అమావాస్యతో ఈ పక్షం ముగుస్తోంది. ఈ సమయంలో చాలా మంది ఈ ఆచారాన్ని అనుసరించి జంగమయ్యల ఇళ్లకెళ్లి బియ్యం ఇస్తుంటారు. పెద్దలు చనిపోయిన తిథులు గుర్తుండని వారు పితృఅమావాస్య రోజున బియ్యం ఇస్తుంటారు.
ఉప్పు, పప్పు, నెయ్యి, కాశీలోన గయ లాంటి పుణ్య క్షేత్రాల్లోని వృక్షం కింద బ్రాహ్మణుల భోజనం నిమిత్తం తృప్తిగా ఇస్తినయ్యా అంటూ జంగమయ్యల ముందు ప్రణమిల్లుతారు. ఇలా సమర్పించిన బియ్యంలోంచి పిడికెడు బియ్యాన్ని తిరిగి తీసుకుని వంట చేసుకునే బియ్యంలో కలిపి ఆ రోజున శ్రాద్ధకర్మలకు అవసరమైన ఆహార పదార్థాలు తయారు చేస్తారు. బంధు మిత్రులతో కలిసి పూర్వీకులను స్మరిస్తూ తర్పణాలు వదిలి భుజిస్తారు.
ఎందుకీ తర్పణాలు
మనిషి ప్రయాణానికి నిజమైన గమ్యం మోక్షమే అని అందరి విశ్వాసం. గతించిన వాళ్లకు మోక్షం లభించాలంటే సశరీరంగా ఈ లోకానికి రావాలంటే వారికి ఆహారం అందిస్తేనే రుణం తీరి మోక్షం లభిస్తుందని ప్రజల నమ్మకం. ఇందులో భాగంగానే పితృ అమావాస్య రోజున తమ కుటుంబంలో మరణించిన పెద్దల పేరిట ఇలా చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment