కుటుంబ సభ్యులతో లక్ష్మణ్
రాజన్న సిరిసిల్ల: పుట్టిన ఊరిలో ఉపాధి లేక గల్ఫ్‌బాట పట్టిన యువకుడు అక్కడ జరిగిన ఓ సంఘటనతో జైలుపాలై.. పదిహేడేళ్లకు స్వగ్రామానికి తిరిగొచ్చాడు. యుక్త వయసులో వెళ్లిన వ్యక్తి మానసికస్థితి సరిగ్గా లేని పరిస్థితిలో స్వగ్రామంలో అడుగుపెట్టాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల లక్ష్మణ్ 17 ఏళ్లకు శుక్రవారం ఇంటికి చేరాడు.
దుబాయిలో ఘటన... ఇక్కడ విషాదం!
కోనరావుపేటకు చెందిన దండుగుల లస్మవ్వ–నర్సయ్య దంపతుల కుమారుడు లక్ష్మణ్ 2005లో దుబాయ్ వెళ్లాడు. అదే సంవత్సరం డిసెంబర్ 29న అక్కడి జబల్‌అలీ ప్రాంతంలోని డాల్ఫిన్ మెకానికల్ సైట్‌లో కొందరు కేబుల్ వైరు దొంగతనానికి ప్రయత్నించారు. ఆ సైట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన వీరబహుదూర్ చూడడంతో దొంగతనానికి వచ్చిన దుండగులు అతన్ని హత్య చేసి పరారయ్యారు.
ఈ కేసులో నిందితులుగా భావిస్తూ అక్కడి పోలీసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్‌తోపాటు సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన సోదరులు శివరాత్రి రవి, మల్లేశం, చందుర్తికి చెందిన బొల్లి వెంకటి ఉరఫ్ నాంపెల్లి, మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు, కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ ఖరీం ఉన్నారు. వీరిలో సయ్యద్ ఖరీం 2014లో విడుదల అయ్యాడు.
24 ఏళ్ల జైలు శిక్ష!
హత్య కేసులో నిందితులుగా భావించిన అక్కడి కోర్టు వీరికి 24 ఏళ్ల జైలుశిక్ష విధించింది. జైలు జీవితం గడుపుతున్న తమ వారిని రప్పించేందుకు వారి కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు.
మంత్రి కేటీఆర్ నేపాల్‌కు వెళ్లి సెక్యూరిటీగార్డు కుటుంబాన్ని కలిసి రూ.15లక్షల పరిహారం అందించారు. వారితో క్షమాభిక్షపత్రాలపై సంతకాలు తీసుకుని.. దుబాయ్ కోర్టుకు పంపగా.. ఆ కోర్టు అంగీకరించలేదు. దీంతో వారు జైలు నుంచి విడుదల కాలేదు. ప్రస్తుతం లక్ష్మణ్ మానసికస్థితి సరిగ్గా లేదని విడుదల చేసినట్లు తెలిసింది.
విడాకులు ఇచ్చిన భార్య
లక్ష్మణ్ దుబాయి వెళ్తున్నప్పుడు భార్య పద్మ గర్భిణి. అతడు వెళ్లిన కొద్ది నెలలకు మగబిడ్డ జన్మించాడు. లక్ష్మణ్ దుబాయిలో జైలుపాలు కావడంతో భార్య పద్మ కొన్ని రోజులు అత్తవారింట్లోనే ఉంది. వీరి కుమారుడు ఏడాదికే మృతిచెందాడు.
భర్త రాక కోసం ఎదురుచూసిన పద్మకు ఆశలు సన్నగిల్లడంతో పుట్టింటికి వెళ్లి విడాకుల కోసం నోటీసులను దుబాయి జైలులో ఉన్న లక్ష్మణ్‌కు పంపింది. లక్ష్మణ్ సంతకాలు చేయడంతో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. లక్ష్మణ్ తండ్రి నర్సయ్య కొన్నాళ్ల క్రితం మృతిచెందాడు. తల్లి నర్సవ్వ ఇన్నాళ్లు చేసిన పోరాట ఫలితంగా కుమారుడు లక్ష్మణ్ ఇంటికి చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment