రాజన్న: అత్తారింటికి వచ్చిన ఓ యువకుడు ఆ ఊరి పొలిమేర్లలో శవమై కనిపించిన ఘటన చొప్పదండి మండలంలోని రెవెళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో తల లేని మొండెంతో ఉన్న మృతదేహం మల్యాల మండలం పోతారానికి చెందిన ముత్కల గణేశ్(36)గా గుర్తించారు.
స్థానికుల కథనం ప్రకారం గణేశ్‌కు రెవెళ్లికి చెందిన బోయ మల్లయ్య కూతురు రజితను ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భార్య, భర్తలిద్దరూ ముంబైలో ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గణేశ్‌కు చేయికి గాయం కావడంతో, నొప్పి తగ్గాక వస్తానని, రెవెళ్లిలోని అత్తగారింటికి సెప్టెంబర్ 2న వచ్చాడు. అత్తారింటి నుంచి వెళ్లిన గణేశ్ కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అయితే గణేశ్ మృతదేహాన్ని రెవెళ్లి గ్రామంలోని మావురం రాంరెడ్డి వ్యవసాయ బావిలో కనుగొన్నట్లు గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. తల లేని మొండెంపై ఉన్న గుర్తులు, పసుపు కలర్ షర్ట్, బ్లాక్ కలర్ జీన్స్‌తో పాటు, కుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా మృతదేహం గణేశ్‌దని గుర్తించారు.
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తలలేని మొండెంతో ఉండడంతో తల భాగం కుళ్లిపోయి ఊడిపోయిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఉపేంద్ర చారి తెలిపారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.కరుణాకర్‌రావు, రూరల్ సీఐ ప్రదీప్, ఎస్‌ఐ ఉపేంద్రచారి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment