రాజన్న సిరిసిల్ల: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రోడ్డును ఆనుకుని ఉన్న ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. చందుర్తి మండలం మల్యాలకు చెందిన రైతు దేశెట్టి రాజయ్య ఉదయమే పొలానికి వెళ్లగా, భార్య లక్ష్మి, కోడలు రవళితో కలిసి వేములవాడ ఆస్పత్రికి వెళ్లారు. ఇదే సమయంలో ఇంట్లోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలో దాచి ఉంచిన ఏడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
భార్య లక్ష్మి, కోడలు రవళి ఇంటికొచ్చే వరకు ఇంటి తాళం పగులగొట్టి ఉండడం, బీరువాలోని బట్టలు మంచంపై పడేసి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చందుర్తి ఎస్సై అశోక్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చందుర్తి సీఐ కిరణ్‌కుమార్.. డాగ్‌స్క్వాడ్‌తోపాటు ఫోరెన్సిక్ నిపుణులు తెప్పించారు. కొన్ని వేలిముద్రలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు.
తెలిసిన వారే దొంగతనానికి..
దేశెట్టి రాజయ్య–లక్ష్మి దంపతుల కుమారుడు రా జుకు నాలుగేళ్ల క్రితం రవళితో వివాహమైంది. రవళి తల్లిగారు పెళ్లి సమయంలో ఒప్పుకున్న ఏడు తులాల బంగారు నగలను వారం క్రితం తయారు చేయించి అప్పజెప్పారు.
పుట్టింటి బంగారు నగలు ధరించకముందే దొంగల పాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల బంధువుల వివరాలతోపాటు సన్నిహితంగా ఉన్న వారి వి వరాలు సేకరించారు. ఇంట్లో బంగారు నగలు ఉన్నాయన్న విషయం తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి పోలీసు ప్రత్యేక బృందాలు..
మండలంలో పది రోజుల వ్యవధిలో రెండు దొంగతనాలు జరగడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ కిరణ్‌కుమార్, చందుర్తి, రుద్రంగి ఎస్సైలు అశోక్, రాజేశ్ పరిశీలించారు. సీఐ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
దొంగతనం జరిగిన సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో సీసీ కెమెరాల్లో ఏమి రికార్డు కాలేదు. దీంతో పోలీసులు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోటలోని సీసీ పుటేజీలు సేకరిస్తున్నట్లు సమాచారం. నాలుగు రోజుల్లో దొంగలను పట్టుకుంటామని సీఐ ధీమా వ్యక్తం చేయడంపై.. దొంగతనానికి పాల్పడ్డ వారు చిక్కినట్లేనని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment