ప్రమాణం అనంతరం పత్రాలపై సంతకం చేస్తున్న హసీనా. పక్కన అధ్యక్షుడు హమీద్
ఢాకా: నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ హసీనాతో బంగాభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రు లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్‌లో 31 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆవామీ లీగ్‌తో జతకట్టిన కూటమి పార్టీలకు చెందిన మాజీ మంత్రులకు స్థానం కల్పించలేదు. ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు.
వరుసగా మూడుసార్లు, మొత్తంగా 4సార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికై హసీనా రికార్డు సృష్టించారు. 1996, 2008, 2014వ సంవత్సరాల్లో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాకూటమి 96% సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఓటర్లను భయపెట్టి హింసకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వారిపై దాడులకు పాల్పడటం, హింస చెలరేగడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment