ప్రజల సొమ్ముతో ఆర్భాటమా?: గడికోట
బాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట ధ్వజం
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రం విడిపోయి సీమాంధ్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో ఇంత అట్టహాసం గా ప్రమాణ స్వీకారం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గురువారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఐదు విమానాలు, పలు హెలికాప్టర్లు వినియోగించడం, కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఉందా అని మండిపడ్డారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఏర్పాట్లకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ తన మనుషులకే ఇస్తూ అవినీతికి ద్వారాలు తెరిచారని ఆరోపించారు.
గంటల తరబడి విద్యుత్ కోతతో పట్టణ వాసులు, పంపు సెట్లకు విద్యుత్ సరఫరా లేక రైతులు అల్లాడుతుంటే, బాబు తన ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లతో విద్యుత్ దీపాలంకరణలు చేసుకుంటున్నారని, ప్రజల సొమ్ముతో ఈ రకంగా ఆర్భాటాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించా రు. ఓవైపు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి చందాలివ్వాలని కోరుతూ, మరోవైపు ప్రమాణ స్వీకారానికి డబ్బును మంచినీళ్లలా ఖర్చుచేయడమేమిటని అన్నారు.
అబద్ధపు రాతలు మానుకోండి: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌సీపీని విలీనం చేస్తున్నారని ప్రధాని మోడీ స్థాయి నుంచి సమాచారం తెలిసిందంటూ ఓ పత్రిక రాసిన కథనాన్ని శ్రీకాంత్‌రెడ్డి ఖండించారు. జగన్‌పై వ్యతిరేక వార్తలు రాయడమే కొన్ని పత్రికలకు అలవాటని, ఇప్పటికైనా వారు అబద్ధపు రాతలు రాయడం మానుకోవాలని హితవు పలికారు.