రుణాలు కాదు.. వర్షాలు మాఫీ అయ్యాయి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు ప్రజలందరి ముందు ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబునాయుడు అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తయినా వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిం చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతులెవరికీ రుణాలు మాఫీ కాలేదు కానీ రాష్ట్రంలో వర్షాలు మాత్రం పూర్తిగా మాఫీ అయ్యాయని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు అధికారంలోకి వస్తే కరువేననే నానుడి రాష్ట్రంలో ఉందని.. ఇప్పుడదే నిజమైందని ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురుస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కూడా లేకుండా పోయిందన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రెండు నెలల పాలన తీరును ఆయన దుయ్యబట్టారు. బాబు వస్తే ఉద్యోగం వస్తుందని ప్రచారం చేసిన ఆ పార్టీ కార్యకర్తలు కూడా ప్రస్తుతం.. ‘బాబు వచ్చాడు ఉద్యోగం పోయింది’, ‘బాబు వచ్చాడు వర్షాలు పడడం లేదు’ అని అనుకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు.
జిల్లాల కలెక్టర్లను, ప్రభుత్వ యంత్రాంగాన్ని ముక్కుసూటిగా పనిచేయొద్దు, తమ పార్టీ కార్యకర్తలకు సహకరించమంటూ కోరిన ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు ఒక్కరేనని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సును ప్రస్తావిస్తూ.. ప్రపంచ చరిత్రలో ఏ పాలనాధిపతి అధికార యంత్రాంగానికి ఇలాంటి ఆదేశాలిచ్చి ఉండరని ఆయన అన్నారు. అత్యున్నత ఐఏఎస్, ఐపీఎస్ హోదాలో ఉన్న వారికీ పచ్చచొక్కాలు తొడగాలని బాబు ప్రయత్నం చేస్తున్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.